-
-
మాటన్నది జ్యోతిర్లింగం
Maatannadi Jyotirlingam
Author: Deevi Subbarao
Pages: 205Language: Telugu
12వ శతాబ్దంలో వున్న బసవన్న, దేవర దాసిమయ్య, అక్క మహాదేవి, అల్లమ ప్రభు మొదలైన మహానుభావులు చెప్పిన వచనాలు కన్నడ భాషలో అపురూపమైన సాహిత్య సంపదగా లెక్కింపబడుతున్నవి. సాంప్రదాయంగా వస్తున్న ఛందస్సు వీటిల్లో ఉండదు. ఒక విధమైన లయ అంతస్సూత్రంగా వుంటుంది. గాఢమై భావుకత వీటి లక్షణం.800 ఏళ్ళు గడిచినా వారు సృష్టించిన వచన సాహిత్యం చదువుతుంటే నేటికీ కొత్తగానే వుంటుంది ఎప్పటికీ వుంటుంది. వాటిల్లో నుండి 168 వచనాలను 'మాటన్నది జ్యోతిర్లింగం' అన్న పేరుతో చేసిన అనువాదాల సంకలనమే ఈ పుస్తకం.
* * *
నాదప్రియుడు శివుడంటారు
కాదు.
వేదప్రియుడు శివుడంటారు
కాదు.
నాదం చేసిన రావణునికి
అర్థాయుష్షు.
వేదం చదివిన బ్రహ్మునికి
శిరశ్ఛేదము.
నాదప్రియుడూ కాదు
వేదప్రియుడూ కాదు
భక్తి ప్రియుడు
మా కూడల సంగమదేవుడు
* * *
ఈ తనువు నాదైతే
నేను చెప్పినట్టు వినదేం?
ఈ తనువు నీదైతే
నువ్వు చెప్పినట్టు వినదేం?
ఇది
నీదీ కాదు నాదీ కాదు
నీవు కల్పించిన లోకపు
వింత దేహం ఇది
రామనాధా
* * *
ఈ పుస్తకానికి 2002లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు, 2010 లో సి.పి. బ్రౌన్ అవార్డు లభించాయి.
