-
-
మా. గోఖలే రచనలు
Maa Gokhale Rachanalu
Author: Maa. Gokhale
Publisher: Kalatapasvi Creations
Pages: 494Language: Telugu
తెలుగు సాహితీక్షేత్రంలో బడుగు వర్గాల జీవితాలకు భాష్యం చెప్పే చరిత్ర రూపుదిద్దుకుని దాదాపు వంద సంవత్సరాలయింది. అలనాటి కరుణకుమార, ఉన్నవ లక్ష్మీనారాయణ, అడివి బాపిరాజు తొలి గొంతులయితే వారి జీవుని వేదననూ, ఆశలనూ, ఆశయాలనూ కళాత్మకం చేసిన కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలే, కళాదర్శకుడు అనడం గోఖలే విషయంలో అక్షర సత్యం. అక్షరాలను అద్భుతమైన చిత్రాలుగా మలిచిన అపూర్వ చిత్రకారుడు గోఖలే. ఆయన చేతిలో కలాన్ని కుంచెను చేసి, కుంచెను కళగా మలిచి ఈ జాతి సంప్రదాయ వైభవాన్ని వెండితెరమీదా, కాగితం మీదా ఆవిష్కరించిన మహాకళాకారుడు గోఖలే. ఈ రెండూ రెండు విభిన్నమయిన పార్శ్వాలు. రెండు విలక్షణమైన ప్రవృత్తులు. గోఖలే సాధికారికంగా అధ్యక్షత వహించిన రెండు విభిన్నమయిన ధోరణులు. రెండు కళాస్వరూపాలను ఉపాసించి, అనంత ప్రవాహాలుగా సాగనిచ్చి – జీవితంలో రెండిటి సమన్వయాన్ని అఖండ గోదావరిని చేసిన ఘనత గోఖలేది. అలనాటి చారిత్రక, పౌరాణిక, జానపద చిత్రాలకు ప్రాణప్రతిష్ట చేస్తూ – ఒక మాధ్యమాన్ని – సినిమాని – చరిత్రను చేసిన కళాకారుడు – మరో కోణంలో వీటితో బొత్తిగా సంబంధమూ, పొంతనా లేని ‘మూగజీవుల’ జీవితాలను తన కలంతో రూపుదిద్దారు. కలకాలం నిలిచే ఆయుష్షును పోశారు.
ఆయన చిత్రాలూ, కథలూ, వ్యాసాలూ, నాటికా – వీటన్నిటినీ ఒక్కచోట చేర్చి – చరిత్ర భుజం మీద చెయ్యి వేసి నడిపించిన అపూర్వ భగీరథుడు – ఈ పుస్తక ప్రచురణకర్త మల్లాది సచ్చిదానందమూర్తిగారు.
ఆయన కృషిని ఇలా అక్షరబద్ధం చేసిన మరో ఇద్దరున్నారు. అభిరుచి వారి ఇంటిపేరు. అభినివేశం వారి చిరునామా. వారే క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ సూరిబాబు, శ్రీకాంత్.
తెలుగు సాహితీ ప్రపంచం చేసుకున్న అదృష్టం పేరు – ఈ పుస్తకం.
- గొల్లపూడి మారుతీరావు
* * *
మా. గోఖలే గారి రేఖావిలాసం త్వరలో మీ ముందుకు.
- ప్రచురణకర్తలు
