-
-
లవ్ లీల - రివైజ్డ్
Love Leela Revised
Author: Sai Ramesh Gandham
Publisher: Self Published on Kinige
Pages: 236Language: Telugu
“మే ఐ కమిన్ డాక్టర్ ..” చనువుగా తలుపు తోసుకుని లోపలికి వచ్చింది లీలమాధురి. “రండి రండి.. ఏమిటి యింత ప్రొద్దుటే యిలా దయచేశారు” అన్నాడు కరెంట్ డయాగ్నోసిస్ పుస్తకం ముందు పెట్టుకుని పేజీలు తిరగవేస్తున్న రాజు సోఫాబెడ్ మీద నుంచి బిడియపడి లేస్తూ. “విశేషమే వుంది చెబుతాను కాని .. సారీ మీరు యింకా తయారవ్వలేదేంటి? హాస్పిటల్ కి వెళ్ళరా..” అంది ఇంకా నైట్ డ్రెస్సులో వున్న అతని వాలకాన్ని చూస్తూ “వెళ్ళాలండి. యిదుగో యిప్పుడే రెడీ అవుదామనుకుంటున్నాను ..యింతలో మీరు వచ్చారు " అన్నాడు బద్దకానికి ముసుగు కప్పుతూ “ఏమిటి ఈరోజు యింత ఆలస్యం.. రాత్రి సెకండ్ షోకేమైనా వెళ్ళారా ..” “అబ్బే .. నేను మామూలుగా సినిమాలకి వెళ్ళనని మీకు తెలుసుకదండీ” “ఆ .. ఆ .. అన్నట్లు మీరు తెలుగు సినిమాలకి వెళ్ళరు కదూ.. మర్చేపోయాను ..” “ఈరోజు నుంచి పోస్టింగ్ మారిందండీ .. ఎనస్తీషియాలజీ కాబట్టి తొమ్మిదింటికి బయలుదేరవచ్చు ..” అన్నాడు కారణం వివరిస్తూ “కనీసం ముఖమైనా కడుక్కున్నారా ..” అంది వెక్కిరింపుగా “ఓ శుభ్రంగా” “అయితే ఈ స్వీట్స్ తీసుకోండి..” అంది గుప్పిటలో వున్న కాడ్బరీస్ చాక్లెట్లు అతనికి అందిస్తూ “ఏమిటండీ నోరు తీపి చేసేటంత విశేషం ..” “ఓ క్షణం కూర్చోవచ్చా..” “ష్యూర్.. ష్యూర్” లీలమాధురి సోఫామీద కూర్చుంది. రాజ్ టేబుల్ కి ఆనుకుని నిలబడ్డాడు. “యిలా నావైపు ఒకసారి చూడండి” అంది. “చూస్తున్నాను .. చెప్పండి” “మీ కంటికి నేనెలా కనిపిస్తున్నాను” “అదీ అడగాలా.. మార్వలెన్ గా కనిపిస్తున్నారు” “అబ్బా.. మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు” చీత్కరింపుని అనునయించింది మాధురి “అయ్యో రామ .. యిప్పుడు నేనన్నదాంట్లో తప్పేముందండీ .. చెప్పండి.. సరిదిద్దుకుంటాను ..” “మార్వలెన్గా కనిపిస్తున్నాను అన్నారు .. అంటే అర్థం అందంగా వున్నానని మెచ్చుకోవటమే కదా ..” “అలా ఎందుకనుకోవాలి .. కొత్త చీర నిండుగా వుంది, కట్టుబొట్టు శుభ్రంగా వుంది అని అనుకోవచ్చు కదా ..” అన్నాడు “ఉ.. సవరించుకోటానికి ఏమీ లోటులేదు”. “కనీసం ఆ మాత్రం బ్రెయిన్ వుపయోగించకపోతే మమ్మల్ని అసలు బతకనిస్తారా మేడం...” ఆ మాటలు నోట్లోనే గొణుక్కున్నాడు “మీరెంత అమాయకులండి ..” కనురెప్పలు రెపరెపలాడించింది అతనివైపు చిత్రంగా చూస్తూ “అవునా.. మీకు అంత అమాయకుడిలా కనిపిస్తున్నానా ..” “కాదు .. పెద్ద బుద్దావతారంలా” పక్కున నవ్వింది. “ఇంతవరకూ నాలో బుద్దుడ్ని మాత్రం ఎవ్వరూ చూడలేదనే చెప్పాలి ..మరి మీకెలా కనిపిస్తున్నాడో ఏమిటో ..” అన్నాడు తొణక్కుండా బెణక్కుండా “మీకు అసలు కోపం లేదు కదా..” అంది ముచ్చటపడుతూ “ఎందుకు లేదండీ కావలసినంత వుంది ..” “మరి నాకెప్పుడూ చూపెట్టలేదే” “మీరు జడుసుకుంటారేమోనని..” “అంత భయంకరంగా వుంటుందా” “ఒకసారి మచ్చుకి చూస్తే మీకే తెలుస్తుంది” “యిప్పుడు కాదు మీ బర్త్ డే నాడు చూపిద్దురు గాని” అంది ముసి ముసిగా నవ్వుతూ. “అయ్ సీ.. అలా చెప్పండి .. అయితే ఈ రోజు మేడం గారి బర్త్ డే అన్నమాట.. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే మేడం ..” అన్నాడు అభినందిస్తూ.
