-
-
లోపలిస్వరం
Lopali Swaram
Author: Renuka Ayola
Publisher: Palapitta Books
Pages: 119Language: Telugu
రేణుక అయోల రెండవ కవితా సంపుటి 'లోపలిస్వరం' ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇందులో ఉన్న యాభై ఏడు కవితల్లో సగానికి పైగా కవితలు ఆమె దైనందిన జీవితంలో తారసపడ్డ సంఘటనలు, ఆమె జీవితంలో ముడిపడ్డ సన్నిహితుల గురించి, స్థలాల గురించి చెప్పినవే. తన రోజూవారీ జీవితాన్ని ఆమె కవిత్వంగా మార్చడమే ఈ కవితల్లో నన్నెంతో ఆకర్షించిన అంశం. అనాది కాలం నుంచీ నిజమైన కవులు చేస్తున్న ప్రయత్నిమిదే. ప్రపంచ వ్యాప్తంగా కవిత్వం గురించి తెలిసిన రసజ్ఞులూ, స్వయంగా గొప్ప కవిత్వం రాసిన కవులూ చెప్తున్నది కూడా ఈ విషయమేననే నేనింతదాక చెప్పింది.
* * *
ఆచూకీ
ఎంత వెదికినా దొరకని చిరునామాలా మానవత్వం
మళ్ళీమళ్ళీ తప్పిపోయింది
మీరు చూసారా! మీరు చూసారా!
అందర్నీ అడుగుతూనే ఉన్నాను-
చీకట్లో జారిపోయిందేమో
దీపం వెలిగించి చూద్దామనుకొన్నాను
కొడిగట్టిన దీపం వెలుతురివ్వనంది
గాలికి ఎగిరిన గాలిపటంలా
ఏ కొమ్మ చివర్న చిక్కుందో?
ఆకాశంలోకి చూసాను
శూన్యం నీలంగా పరుచుకుంది
చెట్టు చెట్టుని గాలించాను
ఆకుల గలగలల గాలి సవ్వడిలో
నేను వెదుకుతున్నది దొరకలేదు
వెదికి వెదికి అలసిపోయాను
అదృశ్యవాణిలా పలుకరించిన అంతరంగం
నువ్వు వెదుకుతున్నది నన్నే అంది
నువ్వేకాదు, అందరూ వెదుకుతున్నది నన్నే
మృదువుగా వినిపించిన మాటలు
మూగదానిని చేసాయి
అజ్ఞానానికి తలవంచాను
నన్ను నేను వెదుక్కున్నాను
మానవత్వం ఆచూకి కోసం
నాలాగే వెదుకుతున్న వాళ్ళందరికీ ఓ విన్నపం
ఒక్కసారి మీలోకి మీరే తొంగి చూసుకోవాలని-
