-
-
కుందాపన
Kumdapana
Author: Ravi Verelly
Publisher: Vaakili
Pages: 136Language: Telugu
కుందాపన
పూలకోసం తుమ్మెదలు గాల్లో పద్యాలు రాస్తున్నపుడో
గాలీ గడ్డిపరక ఉప్పుబస్తాట ఆడుకున్నపుడో
కిరణాల తోకలమీద నీటిరంగులు పురివిప్పినప్పుడో
నువ్వే గుర్తొస్తావ్.
నువ్వెళ్ళాక-
ప్రశ్నలకు జవాబులు వెదుక్కునే రోజుల్లో-
ఎప్పట్లానే సూర్యుడొచ్చాడు
ఆ తర్వాత వానా వచ్చింది.
నువ్వెళ్తూ నాటిన మొక్క
జీవితానికి సరిపడేన్ని పూలని పూసింది.
నువ్వెళ్తూ విసిరిన నక్షత్రం
ఆకాశానికి సరిపడేన్ని వెలుగుల్నీ చిమ్మింది.
హటాత్తుగా-
పగళ్ళ కోసం రాత్రులు
రాత్రుల కోసం పగళ్ళు
విరహ గీతాలు పాడుకోవడం మానేసాయి.
పోగొట్టుకున్నవేమిటో పూర్తిగా మరిచిపోయాక
మిగిలినవన్నీ పగళ్ళని వెలేసిన రోజులే అని తేలిపోయాక
మునిమాపు మూలమలుపులో
పావురాలకోసం గింజలు చల్లుతున్నప్పుడు
చీకటి అంచున పిడిబాకులా తళుక్కుమని
మళ్ళీ నువ్వు కనిపించావ్
రంగుల్ని మింగేసి
చిత్రంగా చీకటిని ఉమ్మేసావ్.
ప్రశ్నల్ని మాత్రమే వెతుక్కుంటున్నప్పుడు
నా దేహం నీ కుంచెగా మారిపోయింది!
సమాధానం ఏమిటా అని చూస్తూ వుండిపోయాను
దాని రంగేమిటా అనీ ఎదురుచూస్తూ వుండిపోయాను.
- రవి వీరెల్లి
