-
-
కొండా లక్ష్మణ్ బాపూజీ దార్శనికత
Konda Lakshman Bapuji Darsanikata
Author: Prof. K. Srinivasulu
Publisher: Rudramadevi Women Welfare Society
Pages: 135Language: Telugu
20, 21 శతాబ్దాల భిన్న దశలలో జీవించిన రాజకీయ నాయకుల్లో బాపూజీ జీవితం విశిష్టమైనది. ఆయన జీవితం తెలంగాణ విశాల రాజకీయ, సాంఘిక చరిత్రల తాలూకు వ్యక్తిగత ప్రతిఫలమే కాదు. వాస్తవానికి అది స్వాతంత్య్రానంతర భారతదేశపు కంపుగొడుతున్న మురికి రాజకీయాల చట్రానికి వెలుపల ప్రజారాజకీయాలకు అద్దం పడుతుంది. ఏక కాలంలో నాలుగు భిన్నమైన, అంతర్గత సంబంధం కలిగి ఉన్న ప్రజాఉద్యమాలతో ఆయన జీవితం ముడివడి ఉన్నదని చెప్పడం సముచితం. అవి వరుసగా నిజాం వ్యతిరేక పోరాటం, వెనుకబడిన కులాల ఉద్యమం, చేనేత సహకారోద్యమం, ప్రత్యేక తెలంగాణోద్యమం.
నియంతృత్వ భూస్వామ్య నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ఉద్యమంలో యువకార్యకర్తగా పాలుపంచుకోవడంతో ఆయన రాజకీయ జీవితం ఆరంభమైంది. ఆ విధంగా ఆయన తన కాలానికి ప్రాతినిధ్యం వహించారు. చాలామంది కాంగ్రెస్ నాయకుల మాదిరే, అహింస ప్రబోధించే గాంధేయతత్వానికి బహిరంగ జీవితంలో కట్టుబడి ఉంటూనే నిజాంపాలనకు వ్యతిరేకంగా సాయుధపోరాటోద్యమంలో ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నారు. జాతీయోద్యమంలో సామాజిక మూలాలు వీడని ప్రజారాజకీయ పార్శ్వాన్ని ఆయన రాజకీయ భావజాలం ప్రకటించింది. ప్రజాస్వామ్య రాజకీయాలలో అంతర్భాగంగా భావించే వెనుకబడిన కులాల ఉద్యమానికి ఈ భావజాలమే ప్రాతిపదిక.
- ప్రొ. కె. శ్రీనివాసులు
