-
-
కొంచెం తూర్పు కొంచెం పడమర
Konchem Toorpu Konchem Padamara
Author: Poduri Krishnakumari
Publisher: Poduri Prachuranalu
Pages: 262Language: Telugu
ఆ వాదం, ఈ వాదం అంటూ సాహితీలోకంలో వివాదాలు రగిలించే రచనలు చేస్తూ పేరు తెచ్చుకునేవారు కొందరయితే, వివాదాస్పద దృక్పథానికి చోటు ఇవ్వకుండా, సంయమనంతో, సంస్కారంతో, సులభగ్రాహ్యంగా, సరళంగా, కథ మధురంగా కథనశిల్పం సుందరంగా ఉండే రచనలు చేసేవారు కొందరు. ఈ రెండవ కోవకు చెందిన వారు ఈ రచయిత్రి.
ముప్ఫై రెండు కథలు ఉన్న ఈ సంపుటిలో - సామాజిక బాధ్యతతో ఆలోచింప చేసే కథలు, జీవిత వాస్తవాలను సార్వత్రిక ధోరణిలో ప్రతిబింబించే కథలు, 'కొసమెరుపు'తో మురిపించే కథలు, కథ వెనుక అసలు కథను దాచి దోబూచులాడే కథలు, ముఖ్యంగా దైనందిన జీవితంలో హాస్యాన్ని ఒక చైతన్యవంతమైన కార్యకలాపంలా చూపించే ఎన్నో కథలు ఉన్నాయి.
మంచి కథకు ఆయువుపట్టు మంచి ఇతివృత్తం. ఆ ఇతివృత్తాన్ని చక్కని పదపోహళింపుతో అభివ్యక్తీకరిస్తే ఆ కథకు చిరాయువు తథ్యం! కథ అనేది గుర్రం పరుగులాంటిదని, దాని ప్రారంభం, ముగింపులు చాలా ముఖ్యం అని ఒక ప్రఖ్యాత ఆంగ్ల రచయిత అన్నట్లు; కథ ఎత్తుగడ, ముగింపుల మధ్య కథా ఇతివృత్తాన్ని చక్కని శిల్ప పరిజ్ఞానంతో అందించారు కృష్ణకుమారి.
మధ్యతరగతి కుటుంబాల జీవితాల్ని కేంద్రబిందువులుగా చేసుకున్నా, సుభాషితాలుగానో, నీతి వాక్యాలుగానో కాకుండా ఆసక్తికరంగా చదివించగల నేర్పుతో స్ఫూర్తితో గుర్తించుకోదగ్గ కథలను రాశారు కృష్ణకుమారి. కథకులు వైతాళికులుగా, క్రాంతిదర్శనులుగా, రచనలు చేసినప్పుడు ఎంతో ప్రయోజనాత్మకతను ఆపాదించుకుని ఆ రచనలు పాఠకుల్లో బలమైన దృష్టికోణాన్ని తెస్తాయి.
చిన్న చిన్న ఉదంతాల చుట్టూ కథలు అల్లి, కొత్త కొత్త హాస్యాస్పద పదప్రయోగాల్తో ఆ కథలకు మంచి పట్టు తెప్పించి అద్భుతమైన హాస్యాన్ని అలవోకగా పండించారు కృష్ణకుమారి. నవ్వు అనేది వెలుగునిచ్చే మూలధాతువు. చమత్కార రసజ్ఞతను పాఠకలోకానికి పంచి ఇచ్చే, నవ్వుల వెలుగుల వెచ్చదనాన్ని అనుభవానికి ఇచ్చారు. వీటిలో ఎన్నో కథలు బహుమతి పొందినవి. బహుమతి పొందకపోయుంటే ఆశ్చర్యపడవలసినదే.
కృష్ణకుమారిగారి ఈ కథాసంపుటి, కథాప్రియులు, కథకుల, సద్విమర్శకుల మెప్పుని, ఆదరాన్ని తప్పక పొందుతుందని విశ్వసిస్తూ, వారిని మరొకసారి మనసారా అభినందిస్తున్నాను.
- అంబికా అనంత్
