-
-
కోనసీమ సంప్రదాయ వంటలు
Konaseema Sampradaya Vantalu
Author: Sundari Vedula
Publisher: J.V.Publications
Pages: 108Language: Telugu
సుమారు నలభై, యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళి నా బాల్యాన్ని గుర్తు చేసుకుంటే మా ఇంట్లోనూ, మా బంధువుల ఇళ్ళల్లోనూ వండే ఎన్నో సాంప్రదాయపు వంటలు, ప్రత్యేక వంటలూ జ్ఞాపకానికి వస్తాయి.
పిల్లలకి నచ్చే పిజ్జా దగ్గరనుంచీ ఎన్నో కొత్త వంటలు నాకున్న ఆసక్తివల్ల నేర్చుకుని ఇంట్లో చేసినా సరే, మా ఇంట్లో మా సాంప్రదాయపు వంటలకే పెద్దపీట. అలాంటివాటిని మీ అందరికీ పరిచయం చెయ్యాలనే ఉద్దేశ్యంతోనే ఈ 100 రకాలను ఎంచుకున్నాను. ఇవి నేను చేసేవే కాక, మా అమ్మా, అమ్మమ్మ, మామ్మగారు, అత్తయ్యలు, పిన్నులు ఇలా ఎందరినించో నేర్చుకున్నవి కూడా.
వీటిల్లో కూరలు, పులుసులు, పప్పులు, టిఫిన్లు, ఊరగాయలు, రోటి పచ్చళ్ళు ఇలా ఎన్నో రకాలున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా వాటిల్లో ఉల్లిపాయ కాని, వెల్లుల్లిపాయ కాని ఉండదు. ఆ కాలంలో మా ఇళ్ళల్లో ఉల్లి నిషిద్దం, కేవలం బాలింతలకు మాత్రమే కొన్ని ప్రత్యేకమైన కూరల్లో వెల్లుల్లిపాయలు వేసి పెట్టేవారు. వాటిని ప్రత్యేకంగా ప్రస్తావించాను.
టెక్నాలజీవల్లనైతేనేమీ, ప్రజలు ఇదివరకు కన్నా ఎక్కువ ప్రయాణాలు చెయ్యడంవల్లనైతేనేమీ, ఉద్యోగం, చదువులవల్ల అనేక ప్రాంతాల్లో ఉండవలసి రావడంవల్లనైతేనేమీ ప్రపంచం రోజురోజుకీ చిన్నదవుతోంది. దానివల్లనే మనకి తెలియని ఇతర ప్రాంతపు వంటలెన్నో మనం అతిసులువుగా చేసుకుంటున్నాం. ఇంటర్నెట్ తెరిస్తే కనిపించని వంట లేదు, తెలియని విధానం ఉండదు.
అలాంటి ఈ స్పీడు యుగంలో కూడా ఎప్పుడైనా ఒక సంప్రదాయపు వంట చేసి రుచి చూపిస్తే ‘ఎంత బావుందో!’ అంటారు మా స్నేహితులూ, కుటుంబసభ్యులు. ముద్దపప్పు, ముక్కల పులుసు కలిపి నెయ్యి వేసి వేడిగా అన్నం పెడితే ఎంతో ఇష్టంగా తింటారు మా మనవలు. అవి విన్నప్పుడు, చూసినప్పుడు వచ్చిన ఆలోచనే ఈ పుస్తకానికి ప్రేరణ.
- సుందరి వేదుల
