-
-
ఖజూరవాటిక
Khajoora Vatika
Author: B.Geetika
Publisher: Self Published on Kinige
Pages: 157Language: Telugu
“ఏరా.. సోమనాధా..! ఏమిట్రా.. అప్పుడే వచ్చేశావ్..?” అని నొసలు ముడిచి సోమనాధుడుని పరిశీలనగా చూస్తూ అడిగాడు రాఘవాచారి.
“ఊహు..” అని అడ్డంగా తలూపుతూ భారంగా ఓ నిట్టూర్పు విడిచాడు సోమనాధుడు.
“వారంరోజులు నాగం వేసుకో అన్నావు. నాలుగు రోజులు కాకుండానే వచ్చేశావు..! ఏమైందిరా..?” అని ఆప్యాయంగా మళ్ళీ అడిగాడు రాఘవాచారి.
గుట్టగా ఉన్న పనిముట్లలోంచి మధ్యస్తకొలత ఉలిని చేతిలోకి తీసుకుంటూ, “ఏమీ లేదు రాఘవయ్యా. శిలల్లో అలవాటైన ప్రాణంకదా. ఉండలేక వచ్చేశా..” అని నిర్లిప్తంగా బదులిచ్చాడు సోమనాధుడు.
సోమనాథుడినే సూటిగా చూస్తూ, “ఈ రాఘవాచారి దగ్గరా నీ దాగుడుమూతలు. ఇటుచూసి చెప్పు.. అలవాటు ప్రాణానికా, మనసుకా..? అది ఇక్కడా.. అక్కడా..” అని అడిగాడు రాఘవాచారి.
“తిరకాసు పెట్టకు రాఘవయ్యా. పని చెప్పు ముందు. యశోవర్మ మహారాజుగారు మన పని గురించి ఏమన్నారు ..?” అని మాటమారుస్తున్నట్టుగా అడిగాడు సోమనాధుడు.
అతని మనసులోని గోప్యాన్ని బయటకి లాగాలనుకోవడం వృధా అని రాఘవాచారికి అర్థమైంది. అందుకే మొన్న మహారాజుగారు శంకుస్థాపనకు వచ్చినప్పుడు వేరే రాజ్యాలనుంచి వచ్చే మహా శిల్పాచార్యులను పంపుతానన్న విషయమూ, రతికా నమూనాల గురించీ, ఇంకా ఆయన చెప్పిన ప్రతిమాటనూ సోమనాధుడికి వివరంగా చెబుతూ పనిలో నిమగ్నమయ్యాడు రాఘవాచారి.
వారిద్దరి మధ్యా పాతిక సంవత్సరాల అంతరం ఉన్నా: ఒకే ఊరివారు అవడంవల్లా, వాళ్ళిద్దరూ ఒకే చోట పని చేస్తుండడంవల్లా... ఇద్దరి మధ్యా బాగా చనువుంది.
సోమనాధుడిపై అజమాయిషీ చేసే స్థాయిలో ఉన్నా, ఎంతో అనుభవజ్ఞుడైనా, రాఘవాచారి ఎప్పుడూ అతనిపై అధికారదర్పం చూపడు. ఆ చనువుని సోమనాథుడు కూడా దుర్వినియోగ పరచడు. పని విషయంలోనూ, మాట విషయంలోనూ తానేంటో ఎరిగి మసలుకుంటాడు.
మహారాజుగారితో మాట్లాడిన విషయాలు ఇన్ని చెబుతున్నా, సోమనాథుడి వైపునుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో, చేస్తున్న పనాపి తలెత్తి చూశాడు రాఘవాచారి.
ఇంతకుముందు చేసిన పనినే కొనసాగిస్తున్నాడు సోమనాధుడు. అతని దృష్టి అతను చెక్కే శిలమీద తీక్షణంగా కేంద్రీకరించి ఉంది. అతని చేతిలోని పనిముట్టుమీద అతని బలం మొత్తాన్నీ ప్రయోగిస్తున్నట్లుగా అది గంభీరమైన శబ్దం చేస్తోంది.
సోమనాథుడి గంభీరతని చూస్తూ, లయతో వినవస్తున్న రాతిసవ్వడిని వింటూ మౌనంగా ఉండిపోయాడు రాఘవాచారి.
- ₹172.8
- ₹86.4
- ₹108
- ₹72
- ₹129.6
- ₹129.6
Good one
Thank you BV Prabhakar garu..