-
-
కవిత 2011
Kavita 2011
Author: Sahiti Mitrulu
Publisher: Sahiti Mitrulu
Pages: 157Language: Telugu
గోడ
ఒరియా మూలం: డాక్టర్ జగన్నాథప్రసాద్ దాస్
తెలుగు అనువాదం: డాక్టర్. జె. భాగ్యలక్ష్మి
* * *
సులభంగా దానిని దాటిపోగలనని
నీవనుకున్నప్పుడు
గోడ అసహజంగా, దుస్వప్నం కొనసాగిస్తునట్టు
మరింత ఎత్తుగా ఉంటుంది
దానిని పగలగొట్టి
దానిలో మార్గం ఏర్పరిచినపుడు
రెండో వైపు చూస్తే
అటువంటిదే మరో గోడ,
నీవు దాటలేని గోడ కనిపిస్తుంది.
బలవంతాన గోడలోకి దూరడానికి ప్రయత్నిస్తే
ఇటుకలు, సున్నము, రాళ్ళు, సంప్రదాయం,
నీమీద పెద్ద భారమయి
నిన్ను గోడలో ఒక భాగంగా చేస్తాయి.
గోడను అదుపులో పెట్టడానికి
రెండే సులభమైన మార్గాలున్నాయి
గోడ నీ ముందు తునాతునకలై
కుప్పకూలేవరకు
ఓపికగా అనంత కాలం
నీవక్కడ కూర్చుని ఉండాలి
లేదా గోడను విడిచి
సహజంగా ఏ అవరోధం లేని
మరో జీవన విధానం వైపు
నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి.
ఏదైనా అద్భుతం జరిగి
గోడను కదిలించి
నీవు అవతలివైపుకు చేరుకుంటే
నీవు చేరుకున్న అపరిచిత స్థలం
నీవెన్నడూ వెళ్ళదలచుకోని
ప్రదేశమని
త్వరలోనే గ్రహిస్తావు.
(సరస్వతీ సమ్మాన్ పొందిన 'పరిక్రమ' నుండి)
