-
-
కవిసంగమం 2012
KaviSangamam 2012
Author: Multiple Authors
Pages: 330Language: Telugu
కవిసంగమం
మూడు పూటలా మూడు చెంచాల కవిత్వం!
నవ్వటం మరచిపోయాం. ఇదో ఫిర్యాదు. అక్కడికి ఏడ్వటం పూర్తిగా తెలిసినట్లు! సుష్టుగా భోజనం చేసినట్లు, తృప్తిగా దుఃఖించి ఎన్నాళ్ళయింది? రెండువందలు తగలేసినా మల్టీప్లెక్స్‌లో మూడు సెకండ్లకి మించి కళ్ళు చెమర్చడం లేదు. ఎంత దగ్గరవాడు పోయినా ఏడుపు వచ్చి చావటం లేదు.
దగ్గర... దగ్గర... అని ఉత్తినే మాట్లాడుకుంటున్నాం కానీ, కొలిచి చూస్తే, కౌగిలిలో వున్నప్పుడు కూడా ఇద్దరి మధ్య దూరం పదివేల కిలోమీటర్లు. ఎదలు కలిస్తే కదా, ఎడబాటు తెలియటానికి! ముద్దు పెట్టిన ప్రేయసి రైలెక్కి వెళ్ళిపోతున్నా కనురెప్పలు తడవవు. కన్నతండ్రి ముఖం మీద కడపటి పిడక పెట్టాక కూడా కన్నీరు ఉబకడం లేదు. కబేళాల్లో పశువుల్ని వదిలి పోయినట్లు, తన్ని తగలేసే స్కూళ్ళల్లో శిశువుల్ని వదిలిపోయినప్పుడు కూడా చెక్కిళ్ళు తడవడం లేదు.
వ్యాధి సోకింది. మహమ్మారిలా పాకుతోంది. ఇంకినతనం. నీరింకిన తనం, కన్నీరింకిన తనం. ఇది సోకిన వాళ్ళు ఇక ఎప్పటికీ ఏడ్వలేరు. ఏడ్పును తిరగేస్తేనే కదా నవ్వు! కాబట్టి నవ్వలేరు కూడా. మందు కావాలి. స్ట్రెచర్ మీద రోగి 'ఆక్సీజన్, ఆక్సీజన్' అని అరిచినట్లు, నేడు మీరూ, నేనూ, అందరమూ 'కన్నీళ్ళు, కన్నీళ్ళు' అని కలవరిస్తున్నాం.
ఎవరన్నా తపసు చెయండర్రా! ఏ దేవతయినా వచ్చి కడివెడు కన్నీళ్ళు ప్రసాదించి వెళ్ళిపోతుందేమో! ఇలాంటప్పుడే రోడ్డు మీద తనలో తాను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్న ఎవరో ఒకతను 'ఏడ్చుకుంటూ' కనిపించాడు. అవును. అతడు అంతటి ఆరోగ్యవంతుడెలా అయ్యాడు?
రహస్యమేమిటి? అతడు క్రమం తప్పకుండా మూడు పూటలా మూడు చెంచాల కవిత్వం తాగుతాడు.
అవును. కన్నీళ్ళే కవిత్వం. కవిత్వమే కన్నీళ్ళు.
నేడు కవిత్వమొక నిత్యావసరం. అందుకే కవిత్వం మీద పడుతున్నారంతా. కవిత్వాన్ని ఎవరూ రాయలేరు. రాస్తే అది కవిత్వం కాదు. కవిత్వం దానికదే రాయించుకుంటుంది.
కళ్ళు చెమర్చిన వారంతా ఒకొక్కరూ ఒక్కో జీవనదిలా ప్రవహిస్తున్నారు. వీరంతా కవిత్వ మహాసాగరంలో కలిసే చోటునే కవిసంగమం అని పిలుస్తారు. ఈ రసక్షేత్రంలో ఒక్కసారి మునిగితే చాలు మొత్తం పొడిదనమంతా పోతుంది.
భూమినీ, దేహాన్నీ, దేశాన్నీ, ఊరునీ, ప్రాంతాన్నీ కోల్పోయిన మేఘాలన్నీ ఒక్కసారిగా కరిగితే కలిగిన కుంభవృష్టిలో తడిసిన మహా దుఃఖానుభూతి కావాలంటే, ఈ క్షేత్రాన్ని దర్శించక తప్పదు.
- సతీష్ చందర్
గమనిక: "కవిసంగమం 2012" ఈ-బుక్ సైజు 8.16 MB

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE