-
-
కథనాల వెనుక కథలు
Kathanala Venuka Kathalu
Author: Dr. Yarlagadda Lakshmi Prasad
Publisher: Lok Nayak Foundation
Language: Telugu
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో ఎందరో అత్యుత్తమ పాత్రికేయులు జర్నలిజంలో ప్రవేశించారు. స్వాతంత్రం ప్రసాదించిన ఈ పాత్రికేయుల్లో శ్రీ కుల్దీప్ నయ్యర్ కూడ ఒకరని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. సత్యాలు చెప్పడమే తమ లక్ష్యంగా భావించి, అందుకు పరితపించినందుకు ఆయనకీ విశిష్టత దక్కింది. నిజానికి పాత్రికేయ వృత్తిలో సత్యాలకన్నా ముఖ్యమైనదేమీ లేదు. వ్యాఖ్యానాల కన్నా, సత్యాల పట్లనే పాఠకులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. స్వతంత్ర భారతం అవతరించడం, శ్రీ కుల్దీప్ నయ్యర్ జర్నలిజంలో ప్రవేశించం దాదాపు ఒకేసారి జరిగింది. అందువల్ల గత ఆరు దశాబ్దాలుగా జాతీయ స్థాయిలో జరిగిన ప్రతి ముఖ్యమైన ఘటనకు ఆయన ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు.
నిజాలను సేకరించేందుకు ఒకవైపు ఎంతో కృషి చేస్తూనే మరోవైపు వాటి పై తన వ్యాఖ్యానాలు చేసేందుకు కూడ ఆయన ఎప్పుడూ వెనుకాడలేదు. అత్యంత ముఖ్యమైన పరిణామాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే నిజాలను, వ్యాఖ్యలను కలగాపులగం చేయకుండ జాగ్రత్తపడడం ఆయన లక్షణం. ఈ పుస్తకంలో ఆయన తాను విలేకరిగా ఉన్నప్పుడు కూపీ లాగిన కథనాల గురించి తెలిపేందుకు ప్రయత్నించారు. ఉత్తమ పాత్రికేయుడు కావాలని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది. అంతే కాదు, చరిత్రలో జరిగిన అత్యంత ముఖ్యమైన విషయాలను ఆయన తన కథనాల్లో రికార్డు చేశారు. అంతే కాదు. ఈ కథనాల్లో గత ఆరు దశాబ్దాల దేశ చరిత్ర, జాతీయ రాజకీయాల గమనం ఎలా ఉండేదో మనకు అర్థమవుతుంది.
శ్రీ కుల్దీప్ నయ్యర్ వెలిబుచ్చిన అభిప్రాయాలు, ప్రకటించిన తీర్పులతో అందరూ ఏకీభవించాలని ఎక్కడ లేదు. అయితే ఆయన నిజాలనుకున్న వాటితో విభేదించడం కూడ కష్టం. అత్యంత వివాదాస్పద విషయాలపై దృఢమైన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ఆయన ఎప్పుడూ తటపటాయించలేదు. అందువల్ల ఆయన పుస్తకం భవిష్యత్ చరిత్రకారులకు ఒక ముఖ్యమైన ఆధారంగా ఉపయోగపడుతుంది.
"కథనాల వెనుక కథలు"లో మనకు గాంధీజీ హత్య, దేశ విభజన, హిందీ రాజభాషగా మారడం, లాల్ బహాదూర్ శాస్త్రి మరణం, ఇందిరాగాంధీ పాలన, అత్యయిక పరిస్థితి, జనతా రాజకీయాలు, సిమ్లా ఒప్పందం, భారత్ పాక్ సంబంధాలు మొదలైన ఆసక్తికరమైన ఘటనలు కన్పిస్తాయి. ఆయన రికార్డు చేసిన అనేక ముఖ్యమైన ఘటనలు దేశచరిత్రని నిర్దేశించాయి. అందువల్ల ఈ పుస్తకాన్ని చదువుతుంటే మనకు చరిత్రతో పాటు పయనిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒక ప్రగాఢమైన రాజకీయ అవగాహన కూడా మనలో ఏర్పర్చేందుకు శ్రీ కుల్దీప్ నయ్యర్ అంతర్లీనంగా ప్రయత్నించారు. శ్రీ కుల్దీప్ నయ్యర్ ఇంగ్లీషులో రాసిన ఈ పుస్తకాన్ని తెలుగులో అనుసృజన చేసినది శ్రీ లక్ష్మీప్రసాద్ గారు.
