-
-
కథాకృతి-1
Kathakruthi 1
Author: Vihari
Publisher: Sri Vedagiri Communications
Pages: 322Language: Telugu
ఈ 'కథాకృతి' సమీక్షా గ్రంథమూకాదు, పరిశీలనాగ్రంథమూ కాదు. కేవలం-ఒక రచయితగా, పాఠకుడుగా-నేను చదివిన కథానికల్లో కొన్నింటి గురించి నాకు తోచిన 'ప్లస్ పాయింట్లు', మానసికంగా, ఏ 'రిజర్వేషన్' లేకుండా ఈ తరం రచయితల అమోఘమైన రచనా శిల్పాన్నీ, శక్తినీ మెచ్చుకుంటూ చెప్పాను. అంతే! అందువల్లనే వీటిలో ఏ 'నెగిటివ్' విమర్శ ఉండదు. నా దృష్టిలో మంచి కథల్ని ఈ తరం పఠితల దృష్టికి కూడా తీసుకురావాలనే చిన్న ప్రయత్నం ఇది. 'ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?' అనే అంతర్వేదన గల సమకాలీన రచయితల చిత్తశుద్ధిని-రవ్వంత- పాఠకులతో పంచుకోవాలనే కోరిక మాత్రమే ఈ వ్యాసాల్లో ప్రతిఫలించే ఉద్వేగానికి కారణం!
ఇందులో పరిచయం చేస్తున్న కథానికలన్నీ నేలమీద నడిచే కథానికలు. నేలమీద నడిచే మనుషుల్నీ, వారి ప్రవర్తననీ, వారి తత్వాన్నీ, మనస్తత్వాన్నీ, జీవన గమనంలో వారు పడిలేవడాన్నీ-చిత్రిస్తూ, సమాజంతో పాటు నడుస్తూ వుంటాయి. అందువల్లనే మన కథానికలు మనిషి జీవితంలోని అన్నికోణాల్నీ, పార్శ్వాల్నీ స్పృశిస్తూ వెలువడుతున్నాయి. అలాగే, నేలతల్లికీ తెలుగు కథానికకీ చాలా అనుబంధం, బంధం, బాంధవ్యం వున్నాయని మళ్ళీ మళ్ళీ చెప్తూ వుంటారు మన కథకులు. పంచభూతాల ప్రభావం (నిప్పూ. నీరూ, నింగీ, నేలా, గాలీ) మనిషిని ఎంతగా యిక్కట్ల పాలు చేస్తున్నదీ కూడా స్పష్టం చేస్తూనే వున్నారు కథకులు. వ్యాపార నాగరికత, వ్యాపార పంటల వ్యామోహం-ఎలాంటి అవస్థల్ని పంచిందో కూడా శక్తివంతంగా చిత్రించారు. అటు హైటెక్ మిరుమిట్లలో, ఇటు గ్రామాల్లో కలుషిత రాజకీయాల మధ్యా-మనిషి విలవిల్లాడ్డమూ కథల్లో ఆవిష్కరించారు. దళితవాదం, స్త్రీవాదం, మైనారిటీవాదం, అస్తిత్వవాదం, మతభేదాలు-ఇలా అన్నింటి స్పృహ కల్గిస్తూ-'కమిట్మెంట్' తోనూ కథల్ని రాశారు. మూఢనమ్మకాల, మనిషి బలహీనతల దోపిడీల, రైతుకూలీల సంబంధాల మధ్య నెలకొన్న కంటిమెరమెర, భార్యాభర్తల మధ్య, తల్లీదండ్రుల - బిడ్డలమధ్య పెరుగుతున్న అగాధాల మూలాలూ -బలంగా బయటపెట్టారు. ఇంతకుముందు అంతగా పట్టించుకోని గిరిజనుల, కులవృత్తుల వారి వాస్తవ జీవితాలకీ ఆర్ద్ర కథనాలు కూర్చారు.
న్యాయ, శాసన, పాలనా వ్యవస్థలలో నెలకొన్న విలాసాలూ, చిద్విలాసాలూ, తగినంత వ్యంగ్యంతోనూ, కావలసినంత నగ్నంగానూ కూడా కథానికల మధ్య నిలబెట్టారు. రంగుల మైదానంలో మనిషి మనస్తురంగం పరుగులూ, మనిషి చైతన్య స్రవంతిలో పారే పిల్లకాలువలూ, మురికికాలవలూ కూడా బాగానే కథానికల కెక్కినై. మనిషి జీవితంలోని ఆనంద విషాదాలు, చేదూ, తీపీ, ఉప్పూ- కారంల మధ్య ఒకింత సాంసారిక ప్రణయం వంటి పులుపూ, మనిషిలోని కోతిచేష్టల హాస్యం వంటి వగరూ కూడా ఎడనెడ ముచ్చటించారు కథకులు.
ఇంట్లో ఇడియట్ బాక్స్ ప్రభావాన్నీ, బయట థియేటర్ , బార్, పబ్, హట్ ప్రభావాన్నీ కూడా ఘాటుగానే చీల్చి చెండాడారు. మధ్యతరగతి బుద్ధిజీవుల్ని, ఆత్మరక్షణలోకీ, ఆత్మన్యూనతా భావనలోనికీ, గిల్టీనెస్లోకీ బాగానే నెట్టగలిగేరు. పోయి పోయి నాకో పిస్తోల్ కావాలని ప్రతివాడూ, అడిగేటట్లుగా సమాజ పరిస్థితి రూపుదాలుస్తోందన్న వేదనని పాఠకులకి దోసిళ్ళతో అందించేరు.
మారుతున్న మనిషీ, మనిషి జీవిత సంఘర్షణా, ఆర్థిక రాజకీయ, కళా, వైజ్ఞానిక శాస్త్ర రంగాల్లో త్వరత్వరగా చోటుచేసుకుంటున్న పరిణామాల మధ్య చలిస్తూ, చలించలేకా, చరిస్తూ, చరించలేకా - ఉక్కిరిబిక్కిరి అవుతున్న బడుగు - బలహీన , కార్మిక - కర్షక, సామాన్య - మాన్య మేధావి, జనఘోషని కథకులు గాఢ స్పర్శతో ఆవిష్కరిస్తూవున్నారు. ఇప్పుడు వీస్తున్న కథానికా గాలిలో ఈ విధంగా - కొంచెం ఆహ్లాదం, ఒకింతగా చిరచిరా, ఉక్కపోతా, తీవ్రమైన హోరూ, వాడీ వేడీ ఎక్కువగా తగులుతూనే ఉన్నై.
అర్థమే జీవన పరమార్థంగా మారిందనే సత్యాన్నీ, మారుతోందనే వాస్తవాన్నీ సామాన్యీకరించి - అన్ని జీవన విలువల మూలాన్నీ - ఈ కోణంలోంచే కొలిచీ, తాట వొలిచీ కూడా కథకులు బాగానే రూళ్లకర్రని ఝుళిపించారు. అలాగే, స్వతంత్ర భారతదేశం పనికిరానితనాన్నీ, ఆకలి నగ్నత్వం ముందు వెలవెలబారుతున్న అభివృద్ధి బోళాతనాన్నిఎండగట్తూనే వున్నారు. ఆథ్యాత్మికత నమ్మిన వారి బలమైన చర్యల్నీ, బలహీనమైన కార్యాల్నీ కూడా కథా వస్తువుల్ని చేశారు. ఏతావాతా, మనిషిలోని మానవత్వానికి మెరుగుపెట్టడానికీ, సమాజ కల్యాణకాంక్షతో, మానవీయమైన కొన్ని గుణాలకి మెరుగులు దిద్దడానికీ - కథానికని శక్తి మేరకు వాడుకున్నారు. అందుకనే నేను మళ్ళీ మళ్ళీ విశ్వసిస్తున్నాను-యువతరం, నవతరం చేతుల్లో తెలుగు కథానిక భవిష్యత్తు ఉజ్జ్వలంగానే వుంటుంది.
అందుకే మన కథానికల్లో యింత వైవిధ్యం. అందుకే అవి నేలమీద నడిచేది! ఇంతటి వైవిధ్యాన్ని సంతరించుకున్న ఎన్నో కథానికల్ని చదివి గుండె పండించుకొని, ఎక్కువ సందర్భంలో గుండె మండించుకుని- భావస్పందనతో, మోయలేని గుండె బరువుతో, అనిర్వచనీయమైన అనుద్వేగంతో, అపూర్వమైన ఆత్మీయ స్పర్శతో పరామర్శించాను, పరిచయం చేశాను! చిత్తగించండి.
- విహారి

- ₹108
- ₹108
- ₹172.8
- ₹108