-
-
కాశీపట్నం చూడర బాబూ!
Kasipatnam Chudarababu
Author: Mani Vadlamani
Publisher: J.V.Publications
Pages: 104Language: Telugu
సాహిత్యమంటే కేవలం హిత వాక్యం కాదు. 'హితంతో కూడుకున్న వాక్యం.' హితం పట్ల మనకి హితవు కలిగించేదేదో మరొకటి ఉండాలి. అదే సాహిత్య కళ. మంచి రచన అంటే కొన్ని అభిప్రాయలని ఏకరవు పెట్టడం కాదు. ఎంత ఉద్వేగంతో చెప్పినప్పటికీ, ఎంత నిజాయితీతో, ఆవేదనతో, ప్రకటించినప్పటికీ, అభిప్రాయాలు అభిప్రాయాలే. రచయితలు తమ అభిప్రాయాలని మన అభిప్రాయాలుగా మార్చాలంటే నమ్మదగ్గట్టుగా కథలు చెప్పాలి. చెప్పడం కాదు, ఆ కథల్లో మానవ ప్రవర్తన, సంఘటనా క్రమం మనకి చూపించాలి. ఆ మనుష్యుల సుఖదుఃఖాలతో మనకొక తాదాత్మ్యతను సిద్ధింపచేయాలి. అది సాధ్యపడినప్పుడే ఆ రచన పది కాలాలపాటు పాఠకుల మనసుల్లో సజీవంగా నిలబడిపోతుంది.
ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న 'కాశీపట్నం చూడర బాబూ' నవలనే చూడండి. ఈ నవల అది సాధించిందనటానికి ఎన్నో గుర్తులున్నాయి. జాగృతి వార పత్రికలో ప్రచురితమవుతున్నప్పుడే అసంఖ్యాకులయిన పాఠకుల అభిమానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు మీరు కూడా చదవడం మొదలు పెట్టగానే అటువంటి ఆహ్లాదానుభూతికి, హృదయసంస్పర్శకీ లోను కాబోతున్నారని నాకు తెలుసు.
- వాడ్రేవు చినవీరభద్రుడు
***
వడ్లమాని మణి 'కాశీపట్నం చూడర బాబూ' అని ఒక నవల రాశారు. ఇది ఆమె రెండవ నవల. పేరులోని తెలుగుతనం నవలలో కూడా వుంది.
ఇది ఒక ప్రయాణం. ప్రయాణం అంటేనే ఎంతోమంది వుంటారు. ఈ నవలలోనూ వున్నారు.
ఎన్నో పాత్రలు అతివేగంగా వచ్చేసి మొదట్లో గాభరా కలిగించినా, రైలు ఎక్కగానే హడావిడిగా వున్నా కాసేపటికి అంతా సర్దుకున్నాక ప్రయాణం సాఫీగా సాగినట్లూ సాగుతుంది.
ఇటీవలి నవలల్లో కనుమరుగైన తెలుగుతనం ఈ నవలలో అడుగడుగునా కనిపిస్తుంది.
పాత్రలు చాలా వున్నా అన్నీ సజీవమైన పాత్రలు. కావాలని కామెడీని, సస్పెన్సునీ సృష్టించే ప్రయత్నం చెయ్యలేదు రచయిత్రి.
ఇది చిన్న నవలే. కథ అంశమూ చిన్నదే. కాకపోతే ఆపకుండా చదివించింది.
ఈ రచయిత్రికి తెలుగు భాష పట్ల అభిమానం వుంది. గౌరవం వుంది. తను చదివిన గొప్ప విషయాలను తన రచనల ద్వారా పదిమందికి తెలియజేయాలని తపన వుంది.
ప్రస్తుతం సాహిత్యంలో ఇవన్నీ కావాలి.
పరిస్థితులు మారిపోతున్నాయి.
తెలుగు సినిమాలు, నవలలు ఇంగ్లీషు పేర్లతో వస్తున్నాయి.
ఇటువంటి సంధి సమయంలో 'కాశీపట్నం చూడర బాబూ' అని తెలుగు పేరు పెట్టి తెలుగుతనం ఉట్టిపడేలా నవల రాసిన రచయిత్రికి అభినందనలు.
వడ్లమాని మణిగారు ఇంకా విస్తారమైన అంశాన్ని ఎంచుకుని మంచి తెలుగు నవల రాయాలని కోరుకుంటున్నాను.
- పొత్తూరి విజయలక్షి
