-
-
కప్పస్తంభం
Kappa Stambham
Author: Dr. Chintakindi Srinivasa Rao
Publisher: Srinija Publications
Pages: 128Language: Telugu
కన్యాశుల్కం వినేవరకూ, ఇష్టపడి చదివేవరకూ ఓ వైపు అలాంటి పలుకుబడి వుంటుందని నాకు తెలియదు. నక్క పుట్టి నాలుగు వారాలే కాలేదు.. నేనింత గాలివాన యెరగనన్నదట..! అబోరు దక్కదు, రొకాయించడం, మరి బుర్ర గొరిగించుకుందామంటే చేతిలో దమ్మిడీ లేదు, ఫెడేల్మంటే పస్తాయించి చూస్తున్నా కనిస్టీబు ఇంకా గిర్రడనే గిరీశం, మధురవాణీ- అవిడ మాటలూ మొత్తానికి ఆ నాటకం తెలుగొచ్చిన వారందరికీ వెర్రెక్కించింది. కళింగాంధ్ర పచ్చి మాండలికం సింహాచలం సంపెంగల్ని, పలాస జీడిపప్పుల్ని మరిపించింది. నాకే గనక అధికారం వుంటే విజయనగరం చౌరాస్తాలో మధురవాణి కాంస్య విగ్రహం పెట్టిస్తానని నండూరి రామమోహనరావు అడపా తడపా డిక్లేర్ చేస్తుండేవారు. అదొక వెర్రి వ్యామోహం.
ఈ వినాయకస్తవం అయిపోయాక మనం ఇప్పుడు మాట్లాడు కోవల్సింది చింతకింది శ్రీనివాసరావు "కప్పస్తంభం” కథా సంపుటి గురించి.
నృసింహ క్షేత్రంలో కప్పస్తంభం కోర్కెలు తీర్చే దివ్యస్తంభంగా వాసికెక్కింది. సింహాచలం దేవుడికెంత పేరు, ప్రతిష్ట ఉన్నాయో కప్పస్తంభానికి కూడా అంతటి మహత్తుంది. ఇంతా చేసి అది ఆలయంలో ఒకానొక స్తంభం. కొన్నిసార్లు అంతే, చిత్రంగా ఉంటాయి. కలియుగంలో రాముల వారికున్నంత పేరు, ప్రఖ్యాతి బంటైన ఆంజనేయస్వామికీ ఉన్నమాట నిజం. ఇక్కడో ముక్క చెప్పాలనిపిస్తోంది. ఆ రోజుల్లో రావిశాస్త్రిని అనుసరించి సంకు పాపారావుండేవారు. ఎక్స్ మిలట్రీ. పాపారావు మంచి మాటకారి. లోకజ్ఞానం, మాటల్లో మెరుపు తొణికిసలాడుతుండేవి. ఒక దశలో యీ గురుశిష్యులిద్దరి మధ్యా చిన్న చిన్న తేడాలొచ్చాయ్. సన్నిహిత వర్గాలకు తెలిసి సంకు పాపారావుని వైనం అడిగారు.
“మా గురువుగారు యీ దేశంలో హనుమంతుడిక్కూడా సెపరేట్ వర్షిప్ వుందన్న విషయం గుర్తెట్టుకోవాల” అన్నాడు. చెప్పిన తీరుకి, స్పాంటేనిటీకి మిత్రులు నివ్వెర పోయారు. నా అంతవాణ్ణి నేనని సూచించాడు మృదువుగా.
అలాగ కప్పస్తంభానికి మహిమలు, భక్తజనంతో ఆత్మీయ అనుబంధం వున్నాయ్. కప్పస్తంభాన్ని భక్తిప్రపత్తులతో ఆలింగనం చేసుకుని, కష్టం చెప్పుకుని కడతేర్చమంటే చాలు. కష్టాలీడేరతాయని భక్తకోటి విశ్వాసం. దాని వల్ల శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి దేవళంలో కొలువుతీరిన కప్పస్తంభానికి మూల విరాట్‌కి మించిన ప్రఖ్యాతి వుంది. వున్నట్టుండి అలాంటి మహిమాన్విత స్తంభం మాయమైంది. "విషయమంతా ఆ నోటా ఈ నోటా అడవివరం పాకిపోయింది. గోపాలపట్నం తెలిసిపోయింది. పెందుర్తి చేరిపోయింది. చోడారం, మాడుగుల, పాడేరు దాటేసింది. విశాఖ నగరమంతా అల్లేసింది. ఉత్తరాంధ్ర ముట్టుకుపోయింది. ఒరిస్సా అంటుకుపోయింది. హైదరాబాద్ అగ్గయిపోయింది”- అని వర్ణిస్తాడు కథారచయిత. మాయవార్త సర్వత్రా వ్యాపించిందని మూడు ముక్కల్లో సరిపెట్టచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే కథనశిల్పం తళుక్కుమంటుంది. ఇక్కడే, రెండు పేరాలు దాటాక- పత్రికా విలేకరుల్లో కొద్దిమంది భక్తులూ వున్నారు. వారూ కప్పస్తంభాన్ని కౌగిలించుకుని కోర్కెలు చెప్పుకునే అలవాటున్న వారే. వారంతా ఇప్పుడు గుళ్లో తామెవర్ని లేదా ఏ రాయిని కౌగలించుకోవాలో చెప్పి తీరాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నిలదీసినట్టుగా అడుగుతున్నారు. వారి ఆందోళన పసిగట్టిన ఆలయంలోని మహిళా సిబ్బంది, ఎందుకయినా మంచిదని కొంగులు కప్పుకుని వారున్న చోటునించి దూరంగా పోతున్నారు”- అంటూ విడమర్చారు. ఇక్కడ వ్యంగ్యం వుంది. స్వజాతి మీద విసురుంది. ఇంతటి విపత్తు వేళలోనూ కొంటెతనం వుంది. చక్రపొంగలిలో జీడిపలుకుల్లాగ యిలాంటి పలుకులు కథ రుచిని పెంచుతాయి. వైష్ణవస్వాములు స్తంభం కోసం నానా యాగాలు, నానా యాగీలు చేశారు. ఇంతకీ కప్పస్తంభం ఆచూకీ దొరికిందా? తిరిగి సర్వశక్తులతో ఆ దివ్యస్తంభం యథాస్థానానికి వచ్చి చేరిందా? ఈ వైష్ణవ మాయను ఛేదించాలంటే “కప్పస్తంభం” కథ కొసంటా చదవాల్సిందే. ఫలశ్రుతిని అందుకోవలసిందే. నాడు ప్రహ్లాదుని కాచి రక్షించిన స్తంభం యిదేనేమో!
- శ్రీరమణ

- ₹118.8
- ₹118.8
- ₹172.8
- ₹129.6
- ₹135
- ₹135
- ₹118.8
- ₹118.8
- ₹172.8
- ₹129.6
- ₹162
- ₹129.6