-
-
కంఠుగాడి కాశీయాత్ర
Kanthugadi Kasiyatra
Author: A.N.Jagannadha Sharma
Publisher: Amaravathi Publications
Pages: 81Language: Telugu
కాశీనే ‘వారణాసి’ అంటారు. వరుణ నది, అసి నదుల సంగమ స్థలాల మధ్య గల ప్రాంతాన్నే వారణాసిగా వ్యవహరిస్తారు. కాశీని ‘బెనారస్’ అని కూడా అంటారు. ఇది ఉత్తరప్రదేశ్లో గంగానది ఒడ్డున ఉన్నది. దేశానికే ఇది ఆధ్యాత్మిక, సాంస్కృతిక రాజధాని. ఇక్కడే గోస్వామి తులసీదాసు ‘రామచరిత మానస్’ను రచించాడు.
కాశీని గురించి ఎప్పుడో ఎక్కడో చదివినవన్నీ ఒకొక్కటీ గుర్తు చేసుకోసాగాడు కంఠు. అంతలో తమ్ముడు ఇంటి నుంచి భార్యామణి రానే వచ్చింది.
“ఏంటి కాశీ వెళ్తున్నారా?” అడిగింది.
“ఎవరు చెప్పారు నీకు?”
“ఇంకెవరు మాణిక్యం చెప్పాడు.”
“నీతో కాశీకి వెళ్ళొద్దన్నాడు కూడా.”
“ఆ సంగతీ చెప్పాడు. నేను మీతో రానుగానీ, మీరెప్పుడు వెళ్ళేదీ, ఎంతమంది వెళ్తున్నదీ చెబితే ట్రైన్లోకి ఫుడ్ ప్యాక్ చేసి ఇస్తాను, మూడు పూటలు ప్రయాణం అంటే ఫుడ్ బాగా ఉండాలి” అన్నది భార్య.
కాశీకి వెళ్తున్నానంటే కోప్పడలేదు. తనని తీసుకుని వెళ్ళడం లేదంటే చేయి చేసుకోలేదు. పైగా మూడు పూటలకి సరిపడా మిత్రబృందానికి ఫుడ్ ఏర్పాటు చేస్తానంటోంది భార్య. ఇది కలా? నిజమా? అనుమానం కలిగింది కంఠుకి. గట్టిగా తనని తానే గిచ్చుకుని ‘అబ్బా’ అన్నాడు.
“ఏంటా గిచ్చుకోడం? ఇది నిజమే! కల కాదు. నేను మీతో ఎందుకు రానంటున్నానంటే... మీరొచ్చిన తర్వాత మా తమ్ముడూ, మరదలూ, మా చెల్లెలూ, మరిదీ... మేమంతా వెళ్దామనుకుంటున్నాం. వాళ్ళతో వెళ్తే అన్నీ హాయిగా తీరుబడిగా చూసుకోవచ్చు. మీతో వస్తే ఒకటే గాబరా! చిరాకు. అందుకే రానంటున్నాను” అంది భార్య. అదీ సంగతి అనుకున్నాడు కంఠు.
