-
-
కామశాస్త్రం విశేషాలు
Kamasastram Viseshalu
Author: Great Indian Sages
Publisher: Victory Publishers
Pages: 105Language: Telugu
ధర్మార్థకామాలనే పురుషార్థాలను సాధించుకోవడానికి కావలసిన ఉపాయాలెన్నో చెబుతూ బ్రహ్మదేవుడు 'స్థితి నిబంధనం' అనే శాస్త్రాన్ని తయారుచేశాడు. స్థితి నిబంధనం మూడు భాగాలుగా ఉంది. మొదటిభాగం ధర్మం గురించి చెబుతుంది. దాన్ని మనువు ప్రజలందరికి తెలియజేస్తానని బ్రహ్మనుంచి గ్రహించాడు. రెండో భాగం డబ్బు గురించి చెబుతుంది. దేవతల గురువు బృహస్పతి దీన్ని తాను వివరిస్తానని బ్రహ్మనుంచి గ్రహించాడు. ఇంక మూడోది, అతి ముఖ్యమైనది కామశాస్త్రం. నందికేశుడు దీన్ని గ్రహించి, వెయ్యి అధ్యాయాలు కల్గిన శాస్త్రంగా తయారుచేశాడు. ఇది మొట్టమొదటి కామశాస్త్ర గ్రంథం.
వెయ్యి అధ్యాయాలున్న ఇంత పుస్తకం మరీ పండితులకు తప్ప సామాన్య జనానికి ఎక్కువగా వున్నదని, నందికేశ్వరుడు రూపొందించిన కామశాస్త్రాన్ని సంక్షిప్తీకరించి 500 అధ్యాయాలతో కొంచెం క్లుప్తంగా మరో గ్రంథాన్ని రూపొందించాడు శ్వేతకేతువు. ఈయన ఉద్దాలక మహర్షి పుత్రుడు. అది త్రేతాయుగంనాటి ప్రజలకోసం రాసిన గ్రంథం.
మళ్ళీ యుగం మారింది. మనుషుల్లో పెద్దపెద్ద తలగడల్లాంటి గ్రంథాలు చదువుకునే ఓపికలు తగ్గిపోసాగాయి. అందుకని బాభ్రవ్యుడనే మహర్షి పూనుకొని 150 అధ్యాయాలతో బాగా క్లుప్తీకరించిన కామశాస్త్రం గ్రంథాన్ని రచించాడు. అది ద్వాపరయుగం నాటి ప్రజలకోసం ఉద్దేశించింది. ఇలాగే చారాయణుడు, సువర్ణనాభుడు, ఘోటకముఖుడు, గోనర్దీయుడు, గోణికా పుత్రుడు, కుచుమారుడు ..... ఇలా చాలామంది కామశాస్త్రంలోంచి తలా ఒక అధ్యాయాన్ని బాగా విస్తరించి విడివిడిగా గ్రంథాలు రాశారు. ఇంక కలియుగం ప్రవేశించింది.
మూలగ్రంథం నందికేశ్వరుడి రచన. తర్వాత రచయితలంతా దాన్ని సులభతరం చెయ్యాలని మొదలుపెట్టి, చివరికి ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క ఉద్గ్రంథంగా తయారుచేశారు. అందుకని వాత్స్యాయనుడు పూనుకొని, ''సంక్షిప్య సర్వమర్థ మవ్వేన గ్రంథేన కామసూత్రమిదం ప్రణీతవాన్'' అంటూ, కామశాస్త్రంలో ఉన్న సమస్త విషయాల్నీ సంగ్రహరూపంలో ఈ పుస్తకం ద్వారా చెబుతున్నాను అన్నాడు.
ఈ పుస్తకం మీద చాలామంది పండితులు వ్యాఖ్యానాలు రాశారు. మానవుణ్ణి సన్మార్గంలో నడపడం ఈ శాస్త్రం లక్ష్యం. దీన్ని సాధ్యమైనంత సరళతరంగా, అత్యంత సామాన్య పాఠకుడు కూడా తేలికగా అర్థంచేసుకోగలిగేలా వ్యాఖ్యానించడం ఈ పుస్తకం ఆశిస్తున్న ప్రయోజనం. అందుకే, విశేషాలను మాత్రమే ఏరి ఈ పుస్తకాన్ని అందిస్తున్నాము.
- ప్రచురణకర్తలు
