-
-
కాలరేఖ - ఈ శతాబ్ది చింతన
Kalarekha Ee Satabdi Chintana
Author: Gunturu Seshendra Sharma
Publisher: Gunturu Seshendra Sharma Memorial Trust
Pages: 184Language: Telugu
కాలరేఖ
ఈ శతాబ్ది చింతన
తులనాత్మక సాహిత్య వ్యాసాలు
Seshendra : Visionary Poet of the millennium
http://seshendrasharma.weebly.com
రెండు మాటలు
ఈ రోజు ఇరవయ్యో శతాబ్దం ఆద్యంతం మన ముందు ఉంది. ఈ శతాబ్దంలో ప్రజా సమూహాలు, ఉద్యమాలు, యుద్ధాలు, భూకంపాల్లాంటి సమస్యలు, సమాధానాలు, భారీ పరిణామాలు, మానవీయ కష్టసుఖాల పరంపరలు - ఈ భూగోళం మీద వీచిన అనంత కల్లోలమంతా మన ముందు ఉంది.
ఎన్ని సిద్ధాంతాలు లేచాయో ఎన్ని సిద్ధాంతాలు పడిపోయాయో, ఆ సిద్ధాంతాలు ప్రజల్ని శాసిస్తున్న కాలంలో ఎంత రక్తపాతం జరిగిందో, పరిణామం కూడా పరిణామగ్రస్తమనే సత్యం తెలీని మూర్ఖుల చేతుల్లో ప్రజలు ఎన్ని విధాల హింసలకు గురయ్యారో, ఎలా శాశ్వతంగా ప్రజలు అజ్ఞానులుగా, భీరువులుగా, మాననీయ పదార్థంగా మాత్రమే ఉండిపోయారో ఇదంతా చూచాము. భూగోళం మీద నిర్నిరోధంగా అవిచ్ఛిన్నంగా విజృంభిస్తూనే వచ్చిన హింస, శోషణ, కుటిలత్వం, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాల నిరంకుశ పరిపాలన, భూగోళం మీద ప్రవహించే నిరంతర అశ్రుధారా ప్రవాహం మానవ జీవితాన్ని విషాద నాటకంగా చూపించాయి. కతిపయ క్రూరవర్గాల అధికార శాసనం ఒక అనివార్య సృష్టి లక్షణంగా చూపించి మనిషి పోరాటాన్ని నిరంతర కర్తవ్యంగా రుజువు చేసింది.
ఇదంతా భరిస్తూ బాధపడుతూ జీవన భారాన్ని భుజాలమీద వేసుకుని మోస్తూ ప్రయాణిస్తున్న ఏకాకి అసహాయ బాటసారిగా నా అనుభవాన్ని నా తీక్ష పరిశీలననీ, నా బౌద్ధిక ప్రతిక్రియనీ అప్పుడప్పుడూ వ్యక్తం చేస్తూ వచ్చాను. ఈ రచనలో అభివ్యక్తులన్నీ సాధారణంగా దేశ విదేశాల్లో నేను సంబోధించవలసి వచ్చిన సభల మూలంగా కలిగిన ప్రరోచన కారణంగా ఉత్పన్నమయ్యాయి. భిన్న భిన్న సాహిత్య రూపాల్లో అది అభివ్యక్తి పొందింది. ఈ సంకలనంలో ఉన్న రచనలన్నీ సమాహారంగా ఈ శతాబ్ది అనుభవాల వైశాల్యాన్ని సంకేతిస్తాయి. అంతర్వితర్కం మాత్రమే పనిచేయగల అంతరంగ సమస్యల్నించీ వాగ్వివాదం పనిచేసే ప్రపంచ రంగ సమస్యల వరకూ విస్తృతమైన బహుతంత్రీ సమన్విత వాద్యం ఈ సంకలనం. బహు చర్చితమైన నా గ్రంథం రక్తరేఖ తర్వాత వస్తున్న గ్రంథం ఈ కాలరేఖ.
- శేషేంద్ర
* * *
అంతులేని విద్వత్తూ అంటరాని విద్యుత్తూ
గుంటూరు శేషేంద్రశర్మ
గుంటూరు శేషేంద్రశర్మ విద్వత్కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి. భాషాపరశేషభోగి. కవిత్వానికి పరుసవేది, విమర్శలో కుండలిని.
తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, హిందీ, ఉర్దూ, ఫ్రెంచి, జర్మన్ భాషలలో పాండిత్యం ఆయన వ్యుత్పత్తి. పాట, పద్యం, కవిత, వ్యాసం ఏది రాసినా.. అందులో శేషేంద్ర ముద్ర తప్పకుండా ఉంటుంది. తిక్కన భీముడిని వర్ణిస్తూ తన అఖండబాహాబలగర్వమ యచ్చట ముంగలిగా మదమత్త భద్రగజసదృశగతిన్ అంటాడు (విరా, అవి. 326). అలాగే శేషేంద్రగారి రచనలకు ముందు ఆయనలోని అఖండశేముషీ ధురీణత నడుస్తుంది. అది ప్రసన్నం కానిదే శేషేంద్ర అర్థం కాడు. కవిగా, విమర్శకుడిగా, పండితుడిగా శేషేంద్రను అంచనావేయటం అంత సులభం కాదు.
ప్రపంచ సాహిత్య ధోరణులకు తగినట్లుగా తన ఆలోచనాదృక్పథాన్ని విస్తరించుకొని, నూతన కవితావాహికను చేపట్టి కవితారంగంలో విశ్వజనీనప్రవృత్తిని ప్రకటించి నూతన శకాన్ని ఆరంభించిన కవి శేషేంద్ర. విమర్శకుడిగా సాహిత్యపు లోతుల్ని ఆవిష్కరింపజేసి ఆలోచనకు తాత్త్వికత అద్దిన సద్విమర్శకుడు.
ఆధునిక సాహిత్యంలో ఆంగ్లాంధ్రభాషాపరిచయాలవల్ల గొప్ప విమర్శకులు కావడం ఈ యుగ విశిష్టత. దార్శనికుడైన కవికి ప్రక్రియలన్నీ కరతలామలకంగానే ఉంటాయి. కందుకూరి వీరేశలింగం యుగం నుంచి రచయిత అనేక ప్రక్రియల్లో ప్రవేశించే పద్ధతి ఒక సంప్రదాయంగా వస్తూనే ఉంది. ఈ కోవలోకి వచ్చే విశిష్టకవి విమర్శకులు శేషేంద్రశర్మ.
విశ్వనాథ, శ్రీశ్రీలలోని కొన్ని అంశల్ని పుణికి పుచ్చుకొన్న శేషేంద్రకి పాశ్యాత్య సాహిత్యదృక్పథం శరీరం. భారతీయ అంలంకారశాస్త్రం ఆత్మ. సాధారణంగా కవిత్వానికి వ్యాఖ్యానం కావాలి. విమర్శవ్యాసాలకు అవసరం ఉండదు. కానీ శేషేంద్ర విషయంలో ఇది వ్యతిరిక్తం.
ఓ ధరిత్రీ! ఓ జననీ! నిశమ్రుచ్చలించిన ఆ పాటను
మళ్ళీ పక్షుల గొంతుల్లో పెట్టు
ద్వేషం గూడుకట్టుకున్న గుండెల్లో జీవన ప్రేమను రగిలించు
తన భవితవ్యాన్ని మహిళల నుదిటికుంకుమతో
యువకుల వేడి నెత్తుటితో కొనడానికి దూకిందా నేల.
ఇదీ శేషేంద్ర చూపు కవిత్వమై ప్రసరించిన తీరు. శేషేంద్ర గురించి తెలుసుకోవాలంటే ఆయనరచనలు చదవాలి. అవి కూడా సమగ్ర శేషేంద్రుణ్ణి ఆవిష్కరించలేవు. అయినా ఆయన గురించి కొన్ని వాక్యాలు ఇలా చెప్పుకోవాలి.
శబ్దశక్తిని తూచగల ఆలంకారికుడు
సంప్రదాయనేత్రాలలో ఆధునికతను చూడగల ద్రష్ట
దేశపౌరుని ఆత్మకథ ఆ దేశ చరిత్ర అని నిరూపించిన దార్శనికుడు
మనిషితత్వాన్ని కవిత్వతత్త్వంగా మలిచిన మహాకవి
- డా. అద్దంకి శ్రీనివాస్
ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు
1521, క్యాలిఫోర్నియా సర్కిల్,
Milpitas | CA | 95035
* * *
ఈ శతాబ్ది చింతన - తులనాత్మక సాహిత్య వ్యాసాలు
''కాలరేఖ'' గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆదికవి వాల్మీకి నుంచి చిలకమర్తి లక్ష్మీ నరసింహం వరకు అనేక విమర్శనాత్మక వ్యాసాలు ఇందులో చోటు చేసుకున్నాయి. వాల్మీకిని, వ్యాసుణ్ణి, మయూరుణ్ణి, కాళిదాసుని కవితాత్మకంగా ఆవిష్కరించారు శర్మగారు. ఇందులోని వ్యాసాలు వైవిధ్యాన్ని సంతరించుకున్నాయి. ఈ వ్యాసాల్ని కవుల పరంగా, ప్రక్రియపరంగా, విషయపరంగా, జీవనరేఖల పరంగా అని నాలుగు విధాలుగా వర్గీకరించవచ్చు.
గ్రీకు భారతీయ నాటకాలలోని సామవైషమ్యాలను తెలిపే వ్యాసం శేషేంద్ర పాండిత్య విస్త్రృతికి మరో తార్కాణంగా నిలుస్తుంది. అరవింద సావిత్రి అనే వ్యాసం ప్రత్యేకంగా పరిశీలించదగ్గది. సూర్యశతకం, నైషధం, సావిత్రి వంటి రచనల్ని విమర్శ వస్తువులుగా తీసుకోడానికి చాలా ధిషణా విశ్వాసం అవసరం.
అరవిందుడి సావిత్రిని భారత రామాయణాల తర్వాత వచ్చిన మూడో ఇతిహాసంగా, అలౌకిక జీవయాత్ర గురించి ఈ దేశంలో వచ్చిన తొలికావ్యంగా అభివర్ణించారు శేషేంద్ర.
* * *
శేషేంద్ర 15వ వర్ధంతి సందర్భంగా కవి కుమారులు సాత్యకిగారు అందిస్తున్న కానుక

- ₹81
- ₹360
- ₹486
- ₹135
- ₹378
- ₹108
- ₹81
- ₹360
- ₹486
- ₹135
- ₹378
- ₹108