చీమ చిటుక్కుమన్నా వినిపించేటంత నిశబ్దం ఆవరించిందా ప్రదేశాన్ని. కుతూహలంగా చూస్తున్నారు అందరూ. తను ఎదురు చూస్తున్న తరుణం ఏతెంచిందని గ్రహించి తన ఆఖరి విద్య కనికట్టును ప్రదర్శించాడు నిశీధుడు.
తలపాగా తీసి నేల మీద పరిచాడు. నేలమీద కనిపించిన చిన్న తాటి ముక్కను దానిక్రింద దాచాడు.
"శాంభవీ, దుర్గదేవతా, ధనలక్ష్మీ, మళయాళ భగవతీ .....చూపవే నీ శక్తి. నీ భక్తుడు అనుకుంటున్న పని చేయవే తల్లీ! ఈ తాడే భయంకరమైన పాముగా మారాలి! పొడలు విడుస్తున్న ఎడారి నాగు....బుసలు కొడుతూ బయటకి రావాలి. దాని కఠోర విషాగ్నికి అడ్డువచ్చిన వారందరూ మాడి మాసి అయిపోవాలి. " అని అరిచాడు అందరికీ వినిపించేటట్లు.
పిండారీల హృదయాలు కంపించాయి. నిజంగా ఎడారి నాగు బయటకు వస్తుందేమో అని భ్రమపడ్డారు ఆ మాటలు విని. అదే నిశీధుడికి కావాల్సింది. వారలా బెదిరిన మరుక్షణం అతని విద్య పని చేసింది. తలపాగా తప్పించేసరికి బుసలు కొడుతున్న ఎడారినాగు ప్రత్యక్షమైంది.
సింహాన్ని చూసిన జింకలాగా చెల్లాచెదరై పోయారు వారందరూ. అది నిజమో కాదో తెలుసుకోవాలన్న కోరిక వారికి ఎవరికీ కలుగలేదు. వినిపిస్తున్న బుసలు నిశీధుడి నోటిలో నుంచి వస్తున్నాయని గ్రహించలేకపోయారు.
Lovely one
Not Bad,Very Intresting