-
-
కాలక్షేపం కథలు
Kalakshepam Kathalu
Author: Meda Mastan Reddy
Publisher: Creative Comedy Club
Pages: 164Language: Telugu
నీ స్నేహితులెవరో చెప్పు, నువ్వెవరో చెప్తాను - అన్నది ఇంగ్లీషు సామెత.
నీ దస్తూరి చూపించు, కలం పట్టుకున్న మనిషి కథ చెప్తాను - అన్నది శాస్త్రం.
అందుకనే ఈ కథల గురించి చెప్పను, కథా రచయిత గురించి చెప్తాను.
మేడా మస్తాన్ రెడ్డి మిలటరీలో పనిచేసాడు. గడియారం ముల్లు దిద్దుకోవలసినంత క్రమశిక్షణ కలవాడు. మనిషిని చూస్తే ఏ కోశానా మిలిటరీ లక్షణాలు కనిపించవు. ఈయన తుపాకీని ఎలా పట్టుకుంటాడా అన్నది ఆశ్చర్యం. కాని పట్టుకునే ఉంటాడు. అది అతని ఉద్యోగం కనుక. అదీ ఒక శిల్పం.
మస్తాన్ రెడ్డి మర్యాదస్తుడు. పది మాటల్ని మనసులో అనుకుని - ఒక్కమాటని ఏరుకుంటాడు. ఆ మాట మిగతా తొమ్మిది మాటల అర్థాల్ని సంధిస్తుంది. ఇది గుర్తుపట్టగలవారికి గొప్ప శిల్పం.
మంచి కథ చెప్పదు. సూచిస్తుంది. ఈ ధోరణిని జీవితంలో పాటించి, పరిణతిని సాధించినవాడు మస్తాన్ రెడ్డి. తన ఆలోచనని మాటల్లో చెప్పడు. సూచిస్తాడు. మీరు మద్దెలపాలెం రావాలనుకోండి. విజయనగరం నుంచి ఆనందపురం మీదుగా మధురవాడ ఎలా దాటాలో చెప్పి తప్పుకుంటాడు. ముందుకెళ్తే కనిపించేది మద్దెలపాలెమే కదా? ఇది గొప్ప శిల్పం.
మస్తాన్ రెడ్డి మన అవసరాలు తీర్చి తన అవసరాన్ని తీర్చడం మనకి తప్పనిసరి అయే చోట ఆగి తప్పుకుంటాడు. తెలుసుకోవలసిన అవసరాన్ని పరోక్షంగా సృష్టించడం ఒక శిల్పం.
మస్తాన్ రెడ్డి పెద్ద మాటలు చెప్పడు. పెద్ద మనసుతో చెప్తాడు. వీటిని 'కాలక్షేపం కథలు' అనడంలోనే ఆయన గడుసుదనం తెలుస్తోంది. ఆకాశాన్ని చూపించి అటకదాక పాకలేని నేపథ్యంలో - నేల మీద నిలబడి నక్షత్రాల్ని గుర్తు చేయడం గొప్ప శిల్పం.
మస్తాన్ రెడ్డి నా అభిమాన వ్యక్తి. ఆ అభిమానాన్ని ఎల్లరకూ పంచే ఔదార్యం ఆయన కథల మూల సూత్రం. మస్తాన్ రెడ్డి జీవిత శిల్పాన్ని ఒడిసి పట్టుకుని కథల్లో శిల్పాన్ని బిగించిన టెక్నీషియన్.
చివరగా ఒక్క మాట -
ఈ కథలు చదవడం కేవలం కాలక్షేపం కాదు.
తన కథలకు దొంగపేరు పెట్టిన ఓ మిలటరీ రచయిత హృదయాన్ని పట్టుకోవడం.
- గొల్లపూడి మారుతీరావు
