-
-
కైవల్యం
Kaivalyam
Author: T. Srivalli Radhika
Publisher: Self Published on Kinige
Language: Telugu
ఇది నా రెండవ కవితాసంకలనం.
జీవితంలో కొన్ని మలుపులు మన ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చేస్తాయి. ప్రాపంచిక విషయాలలోని లోటునీ, అసంపూర్ణతనీ గుర్తించడం వల్ల ఏర్పడే మలుపులు కొన్నయితే, ఓ సంఘటనో, సద్గురువో మనకి ఎదురవడం వల్ల కలిగిన క్రొత్త అవగాహనతో ఏర్పడేవి మరికొన్ని. బహుశా మొదటివి వైరాగ్యానికీ, రెండోవి జ్ఞానానికీ బీజాలు వేస్తాయేమో!
అలాంటి ఒక మలుపులో వ్రాసిన కవిత “కైవల్యం”. వ్యక్తిగతంగా నా జీవితాన్ని గురించీ, మనసుని గురించీ, అలాగే ప్రపంచాన్ని గురించీ అంతకు ముందు కలిగిన భావాలు వేరు. ఆ తర్వాత కలుగుతున్న భావాలు వేరు.
ఆ వ్యత్యాసాన్ని ఈ పుస్తకంలో పట్టి వుంచుదామన్న వుద్దేశ్యంతోనే బాగా పాతవైనప్పటికీ, “కైవల్యం” కి ముందు వ్రాసిన నాలుగు కవితల్ని కూడా యిందులో చేర్చడం జరిగింది. అవికాక మరొక పాతిక కవితలు. మొత్తం ముప్పై కవితలున్న ఈ కవితాసంకలనం యిపుడు కినిగె లో లభ్యమౌతోంది.
ఈ కవితల గురించి శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి పరిచయవాక్యాలు దిగువ చూడగలరు.
"పలుకు పదను తెలిసిన వారి చేతిలో వచన కవిత శక్తిమంతమైన ప్రక్రియ అవుతుంది – అని ఋజువు చేసిన వారిలో శ్రీమతి శ్రీవల్లీ రాధిక గారు ఒకరు.
హాయిగా చదివించి, లోతుగా ఆలోచింపజేసే కవితలివి.
సామాజిక రీతుల్ని విశ్లేషించి ఎత్తి చూపుతూ, మానవ పృకృతిలోని వికృతుల్నీ, వివిధ మనోభావాల వెలుగు నీడల్నీ – కవిత్వపు విలువలు కదిలిపోకుండా, పకడ్బందీగా వీటిలో పరామర్శించారు.
ముఖ్యంగా- భక్తి, తాత్విక చింతన కలిసిన కవితలు సౌరభమరందాలను దాచుకున్న పద్మ మాలికల్లా సుతిమెత్తగా హృదయాన్ని తాకి, గాఢంగా లోలో పరిమళించాయి.
ఇంత చక్కని కవితా సంకలనాన్ని రచించి, తన పరిణత ప్రజ్ఞను చాటిన ఈ సారస్వత మూర్తి, మరిన్ని మంచి రచనలను వెలువరించి తెలుగు భారతిని అలంకరించాలని ఆశిస్తూ -
అభినందనలతో
సామవేదం షణ్ముఖ శర్మ"
ఆంధ్రభూమి లో సమీక్ష
http://www.andhrabhoomi.net/content/kaivalyam