-
-
జ్వాలాముఖి
Jwalamukhi
Author: Madhubabu
Publisher: Sri Srinivasa Publications
Pages: 310Language: Telugu
గంభీరంగా తలాడించి వాత్సవ, శ్యామ్సుందర్ల వంక చూశాడు బాద్షాఖాన్.
“ఎనిమిదేళ్ళ నా నిరంతర కృషి ఫలితం, మా సైంటిస్ట్‌ల మేధస్సుకు ప్రతిబింబం ఈ వాల్కెనో 2002. అంటే భయంకరమయిన అగ్ని పర్వతం. మీ భాషలో చెప్పాలంటే ‘జ్వాలాముఖి’. ప్రపంచంలోని ఏ దేశమూ ఇంతవరకూ ప్రయోగించని రాకెట్ ఇది. దీన్ని అంతరిక్షంలో నిలబెట్టటం ద్వారా మీ భారత దేశంలో కోరుకున్న చోట లావాను మించిన అగ్ని వర్షాన్ని కురిపించగలం. రేపు రాత్రి పది గంటల పది నిముషాలకు ఈ రాకెట్ అంతరిక్షంలోకి ప్రయోగింపబడి... సాయంత్రం నాలుగు గంటలకి అంతరిక్షంలోని నిర్దేశించిన ప్రదేశాన్ని చేరి పనిచేయటం ప్రారంభిస్తుంది. దాన్ని నియంత్రించే శక్తి మా పాలకుల చేతుల్లో వుంటుంది. అప్పుడు ఇక యుద్ధం ప్రసక్తిలేదు... మేము చెప్పినట్లు మీ పాలకులు వినవలసిందే. జ్వాలాముఖి అంతరిక్షంలోకి దూసుకుపోయే దృశ్యాన్ని కళ్ళారా చూసేటంత వరకూ మీకు గడువు యిస్తున్నాను. చూసిన తర్వాత మీ మనసులు మార్చుకుంటే బ్రతికిపోతారు... లేదంటే ఈ లోయలోనే శాశ్వతంగా సమాధి అయిపోతారు” అన్నాడు.
వెన్నులోంచి ఎగదన్నుకు వస్తున్న ఆవేశంతో పిడికిళ్ళు బిగించాడు శ్యామ్‌సుందర్. అన్నిటికీ తెగించి అటో ఇటో తేల్చుకోవాలన్న అతని నిర్ణయాన్ని కనుచివరల నుండి గమనించి కలవరపడ్డాడు వాత్సవ. కనుసైగలతో అతన్ని వారించటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాడు.
వాత్సవ ముఖంలోకి చూసిన తరువాత తన ఆవేశాన్ని బిగపట్టి వుంచాడు శ్యామ్‌సుందర్. అటో ఇటో తేల్చుకోవాలన్న తన నిర్ణయానికి తాత్కాలికంగా పగ్గాలు బిగించాడు.
