-
-
జీవరహస్య లిపి
Jeevarahasya Lipi
Author: Khadar Shareef Shaik
Pages: 87Language: Telugu
ఆమెని గీయదలచాను
కుంచెని గుండెని చేసి కన్నీళ్ళని సిద్ధం చేస్కుని
నా వైపు ఆవిడ చూడనంతకాలం
ఆవిడనే తదేకంగా చూస్తూ బతికాను
ఆవిడ పరిమళాన్ని ఊపిరితిత్తుల నిండా నింపుకొని
కనురెప్పల్లో రూపాన్ని నిక్షిప్తం చేసుకొని
అద్దంలో నన్ను నేను చూస్కున్నంత స్పష్టంగా
హృదయం ఒడ్డున ఆవిడని నిల్పి
పునః ప్రతిష్ట చేయడానికి
నన్ను నేను తవ్వుకున్నాను
జీవితం దాహంతో మిగిలిపోయింది
ప్రేమలు కన్నీటి ఉప్పదనాన్ని నింపుకొని
తమని తాము రాల్చుకొనే
ప్రయత్నం ప్రారంభించి
కళ్ళనుంచి వీడ్కోలు తీసుకొంటున్నాయి
ఏవో, ఏవేవో కాసిన్ని సందర్భాలు
కొన్ని జ్ఞాపకాలు నక్కి నక్కీ
బ్రతుక్కీ... మనిషికీ మధ్య జరుగుతున్న
పోరాటాన్ని ఉత్కంఠగా చూస్తున్నాయి
నన్ను నేను వెతుక్కుంటున్నాను గానీ
ఎక్కడ పోగొట్టుకున్నానో అర్ధమయితే గదా
మరణం కూడా నాకు
సహజాతి సహజం అయ్యాక
బతికిన క్షణాల్ని
కొలిమిలో కుమ్మరించుకుంటాను
ఇప్పటికీ...
నిజంగానే ఆమెని గీయదలచాను
ఎన్నేసి జ్ఞాపకాల్ని ఇచ్చిందీ... అంత కర్కశంగా మాత్రం మాత్రం కాదు...
జీవించి ఉన్నంతకాలం
దుఃఖిస్తూ సుఖించమని
జనులందరూ తరతరాలుగా ప్రేమిస్తున్నారు
వ్యధల్నీ... దానిలోని వేదనల్ని ఆహా!
ఎంత కొనసాగింపు... ఎంతశక్తి!
