-
-
జీవన శిల్పం
Jeevana Shilpam
Author: Kanneganti Anasuya
Pages: 171Language: Telugu
క్రమేణా ఆమె వస్తుందా రాదా అని ఎదురు చూడటం నాకో అలవాటుగా మారిపోగా.
పదిరోజులైనా ఆమె కొత్త చెప్పుల్తో రాకపోయే సరికి మంచి ఎండలో చెప్పుల్లేకుండా ఎలా నడవగల్గుతుందా అని ఆలోచన మొదలైంది. అలా మొదలైన ఆలోచన ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరిగిపోగా క్రమంగా అది పశ్చాత్తాపంగా మారి ఇంటికి రాగానే నేను చేసిన తప్పు నన్నెక్కిరిస్తూ ఎదురుగా కనిపిస్తుంటే నాకు నిద్దరెలా పడుతుంది? అమ్మవారి గుడి ముందు బతుకుతూ ఇలాంటి అప్రాచ్యపు పనికి నా మనసెలా ఒప్పిందో! రేయింబవళ్ళు ఇదే ఆలోచన.
ఏం చెయ్యాలి? ఎలా? ఈ బాధ నుండి బయటపడాలి. అయినా నాకెందుకింత ఆశ? పైసా ఖర్చు లేదు. తిండంతా గుళ్ళో ఇచ్చే ప్రసాదాల్తోనే అయిపోతోంది. పెళ్ళాం బిడ్డలు లేనేలేరు. ఏం చేసుకుంటా నిదంతా? ఎవరికోసం నేనిలాంటి తప్పుడు పన్లు కూడా చేసి సంపాదించాలి? ఆమె ఇచ్చే రూపాయి నాకు తక్కువ అవటం వల్ల నష్టం ఏమీ లేదే. అయినా ఆమె చెప్పులు ఆమె ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నా దగ్గరే వుంచి తీరాలన్న రూలేం లేదే. మరి ఎందుకంత శాడిస్టుగా ఆలోచించాను. నేనిలా ఆలోచించడమంటే ఆమె హక్కుని కాలరాయాలనుకోవడమే!
