-
-
జయంత మహాపాత్ర కవితలు
Jayanta Mahapatra Kavitalu
Author: Dr. U. A. Narasimha Murthy
Publisher: Palapitta Books
Pages: 105Language: Telugu
మూలం: జయంత మహాపాత్ర
అనువాదం: డా. యు. ఎ. నరసింహమూర్తి
యాభై ఏళ్లకు పైగా విస్తరించిన సాహిత్య జీవితాన్ని మొత్తంగా దర్శింపచేయడం చాలా కష్టం. అద్భుతమయిన విస్తృతి, లోతూ, కవిత్వ సాంద్రత వున్న కవి. ఒక యాభై ఏళ్లుగా అతని చుట్టూ ఆవరించి, అతన్ని అల్లుకున్న ఒరిస్సా ప్రజల జీవితాన్ని- అతని కవిత్వంలో చూడవచ్చు- ఎప్పుడూ ఒక రాకపోక జరుగుతూనే ఉంది. జనం నుంచి తననీ, తన నుంచి జనానికీ- అతనే భాషలో రాస్తేనేం- జీవితాన్ని జీవనానుభవాల్ని- దాని సమస్త పార్శ్వాలతో అందుకున్నాడు.
అటువంటి భారతీయ ఆంగ్ల మహాకవి- కవిత్వాన్ని అదే రసానుభూతితో, అదే తన్మయంతో- ఉన్మీలనంతో నరసింహమూర్తిగారు అనువదించారు. రెండు పుస్తకాలు ఒకటి- బాంధవ్యం అనే కావ్యం- రెండోది దీనికంటే ముందు అనువాదం చేసింది- A Whiteness of Bone. మూల రచయితా, అనువాద రచయిత మధ్య- ఏదో రసాయనిక చర్య ఉంది- జరుగుతుంది.
తన స్వభావానికి విరుద్ధమైన కవిని అనువాదానికి ఎవరూ ఎన్నుకోరు. తనదయినదేదో మూల కవిలో కనుగొన్నప్పుడే- తను చెప్పాల్సింది అతను చెప్పాడే అని అనుకొన్నప్పుడే అనువాదానికి దిగుతారని- స్నేహంలో గూడ- ఇటువంటి రహస్యమేదో ఉంది. బహుశ దాంపత్యంలో గూడ.
ఏఏ అంశాలు, జీవన దృశ్యాలు, ప్రకృతి రంగులు మహాపాత్రను కదిలించాయో- పరోక్షంగా నరసింహమూర్తిగారినీ కదిలించాయి. Two Voices లాగా కన్పడ్డా, నిజానికి ఉన్నది ఒక voice. భాష మారుతుంది. అంతే.
పండితుడు, పరిశోధకుడు, చరిత్రకారుడూ, నిరంతర స్పందనాశీలి, అపార జ్ఞాన దాహం ఉన్నవాడు, వినయశీలి, వివేకవంతుడూ అన్నింటికీ మించి మనుషుల్ని, జీవితాన్ని, ప్రపంచాన్ని అపారంగా ప్రేమించినవాడూ, రస హృదయుడూ అయిన డా. యు.ఎ.నరసింహమూర్తిగారు చేసిన ఈ అనువాదం నాకు తృప్తినిచ్చింది. అనువాదంలాకాక సొంత రచనలా నన్నది చదివించింది.
- శివారెడ్డి
