-
-
జాతక మోక్ష ప్రదాయిని
Jataka Moksha Pradayini
Author: Dr. Pandit Malladi Mani
Publisher: Victory Publishers
Pages: 164Language: Telugu
ఈ పుస్తకం వ్రాయాలనే సంకల్పం ఒక విచిత్ర సమయంలో నాకు కలిగింది. సోదర సమానుడు, మిత్రులు అయిన శ్రీ ఆచంట సుబ్రహ్మణ్యం గారు నాతో సల్లాపాలాడుతూ ''మీరు చనిపోయిన తర్వాత కూడా మీ పుస్తకాలు ఉంటాయి. అవి ఎంతోమందికి మార్గదర్శకాలు అవుతాయి. మీరు ఇలా వ్రాస్తూనే ఉండండి. ఎందుకంటే మీరు వ్రాసినవి చాలవు. మీకు వ్రాసే శక్తి ఉంది. అందుకని ఇంకా వ్రాయండి. మీ పుస్తకాలు చూసినప్పుడల్లా ''అయ్యో! జ్ఞాని, మంచి పండితుడు, ఆత్మమిత్రుడు పాపం పోయాడే అని మీరు పోయిన తర్వాత మనస్పూర్తిగా ఏడుస్తాను'' అని అన్నారు. ఆయన ఏదో సరదాగా అన్నా కూడా ఆయన చెప్పిన విధానంలోని భావార్ధం నన్ను కదిలించివేసింది. నా మీద ఆయనకు ఎంత ప్రేమ, అభిమానం, గౌరవాలు ఉన్నాయో, నేను కనుమరుగైనప్పుడు ఎంతగా రోదిస్తారో నాకు ఆయన నవ్వుతూ చెప్పినా ఆ పదకూర్పులోని భావమే కాకుండా ఆయన హృదయస్పందనలోని వేదన నాకు తెలిసిపోయింది. ఆ క్షణంలో నేను కూడా నవ్వేసినా ఆయన నా మరణ ప్రస్తావన తెచ్చినందువల్లనేమో ఆ మరుక్షణమే కేవలం మారకత్వాల మీద ఎందుకు ఒక పుస్తకం వ్రాయకూడదనే ఆలోచన నాలో కలిగింది. ఈ సంగతి తెలిసి నా శిష్యులు, మిత్రులు వద్దని వారించారు.
ఎందుకంటే ఇంతవరకు పూర్తిగా మారక కారకత్వ గ్రహస్థితి వివరిస్తూ ఎవ్వరూ ఒక్క పుస్తకం కూడా వ్రాయలేదు. కాని అక్కడక్కడ ఒకటి లేక రెండు ఉదాహరణలుగానే వ్రాసి వదిలివేశారే తప్ప మారక కారకత్వాల మీద పూర్తిగా శాస్త్ర వివరణతో ఎవ్వరూ ఒక్క పుస్తకం కూడా పూర్తిగా వ్రాయలేదు. ఏ మహాపండితుడు చేయని ధైర్యం నేను చేయడం శ్రేయస్కరం కాదని, మారకత్వాల వివరణ దుష్ఫలితాలకు మూలమని, వాటిని గురించి విశ్లేషించి చెప్పడం శాస్త్ర విరుద్ధమని, మారక కారకత్వాల గురించి విడమర్చి ఇలా చక్రాలు వేసి చూపించి చెప్పడం నాకు హానికరమని, మారక కారకులైన గ్రహాలను తట్టిలేపడమేనని చాలామంది వారించారు. ఇది విని ''వారు చెప్పినది నిజమైతే జ్యోతిషశాస్త్రం తప్పేకదా?'' అన్నారు శ్రీ సుబ్రహ్మణ్యంగారు. నవ్వుతూ అన్నా, నవ్వులోని నర్మగర్భమైన శాస్త్ర సత్యాలలోని రహస్య గూడర్ధం నాకు స్పష్టంగా అర్ధమై పోయింది. ఆయన తప్పక వ్రాయమనే చెప్పకనే చెప్తున్నారని తెలుసుకున్నాను. ఆయన కళ్లలోని వెలుగు, ఆ సమయంలో ఆయన ముఖంలో ఉన్న తేజస్సుతో కూడిన ప్రశాంతత నన్ను ఆయనలో, గ్రహాధిపతి అయిన గురువును ప్రత్యక్షంగా చూసేటట్లు చేసాయి. ఉత్సాహపరుస్తున్న ఆయన మాటను కాదనే ధైర్యం నాకు లేదు. అందువల్ల నాలోని స్ఫూర్తిని అణచుకోదలచక ఇంతవరకు ఎవరూ వ్రాయని పుస్తకాన్ని నేను వ్రాసి, ఆ వ్రాసిన కారణంగా నాకు మారకత్వం వస్తే, లేక ఏదైనా దీర్ఘవ్యాధి లాంటివి వచ్చినా లేక వేరే ఏదైనా దుష్ఫలితం సంభవించినా నేను వ్రాసిన ఈ పుస్తకం మాత్రం ఆంధ్ర ప్రజలకు, పండిత పామరులకందరకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పైగా ఈ పుస్తకం చదివినవారు ఎవరైనా నా మరణవార్త విని కంటతిపెడితే అదే నాకు మరణానంతర సౌభాగ్యం అనిపించింది. నేను పోయినా ఈ పుస్తకం చిరస్థాయిగా ఉండిపోతుంది. అందువల్లే ఈ పుస్తకానికి కారకులు అయిన నా మిత్రులు శ్రీ ఆచంట సుబ్రహ్మణ్యంగారికి నా పరమ మిత్రాభిమానంతో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
- రచయిత

- ₹162
- ₹86.4
- ₹75.6
- ₹162
- ₹72
- ₹145.8