-
-
హెన్రిక్ హెయినే జీవితమూ కవిత్వమూ
Heinreich Haine Kavitvamu Jeevitamu
Author: Dr. Avantsa Somasundar
Publisher: Kalakeli Prachuranalu
Pages: 64Language: Telugu
హెన్రిక్ హెయినే జీవితమూ కవిత్వమూ
''జర్మన్ విప్లవ దృక్పథం పండితుల పారిభాషిక పదాల మాటున పడి, భాషా భేషజాల బండరాళ్ళ క్రింద నలిగి కృశించి పోతున్న సమయంలో- ఒకే ఒక్క మేధాహృదయం 1833లో మేల్కొంది. ఆ మహామనస్వి ఎవరో కాదు హెన్రిక్ హెయినేయే!'' అన్నాడు ఫ్రెడరిక్ ఏంగెల్సు, లుడ్విగ్, పూరర్బా గురించిన తన మహత్తర తాత్త్విక గ్రంథంలో.
ఆ మహానీయుడు పంతొమ్మిదో శతాబ్ది జర్మన్ చరిత్రకు తన సాహిత్యం ద్వారా నూత్న కాంతులందించిన వాడనేది సర్వతా అంగీకరించే సత్యమే. ఆయనే ఉద్ఘాటించినట్లు ''ప్రతి యుగమూ నూతన భావజాలం సంతరించుకుంటూనే ప్రపంచం గురించి నూత్న దర్శనం సముపార్జించుకుంటుంది''. ఎంత చక్కని సత్యమిది. నూత్నత్వం కోసం అన్వేషణే లేకపోతే మానవజాతి యిప్పటికీ ఆదిమ దశలోనే గుడిసుళ్ళు పడుతుండేది. నూత్న దర్శనంగల మేథావులే యుగద్రష్టలు కాగలుగుతారు. మిగిలినవారు అనుచరులుగా మిగిలి పోతుంటారు. కనుకనే హెయినే నిస్సంశయంగా యుగద్రష్టగా కీర్తించబడ్డాడు.
పాత్రికేయుడుగా, రచయితగా, గ్రంథకర్తగా హెయినే మేథ ఎంతో నిశితమైంది. ఆయన వచన రచనా శైలి హృద్యమైనదీ ఆర్ధ్రమైనదీ!
హెయినే వచన రచనా శైలి ప్రత్యక్షంగానూ, వ్యంగ్య వైభవంతోనూ సాగుతుంది. శుద్ధ వచనపు పడికట్లను పోకార్చుకుంటుంది. అనవసరపు వివరణల దురాక్రమణలు తొలగించుకుంటుంది. కవితా తేజస్సుతో తళతళలాడుతుంది. సంప్రదాయక సరిహద్దుల్ని అతిక్రమిస్తుంది. భూగంధ వాస్తవికతను విడువకుండానే ఒక్కమారు ఆలోచనల వ్యోమ సంచారానికి దూసుకు పోతూంటుంది.
హెయినే ఓ నాలుగు పాదాల కవితలో ఎంత మనోహర భావం నిక్షిప్తం చేస్తున్నాడో తిలకించండి.
"On wings of song, beloved
I will bear you away, throught the air
A way to the ganges-River
I know of a valley there.
ఈ కవిత ద్వారా హెయినేకి భారతదేశం గురించీ, గంగానదీ పవిత్ర సలిలాలు గురించీ ఏదో ఒక ఆరాధనా భావం ఉన్నట్లే అర్ధమవుతుంది.
