బడ్డీ ముందు భాగంలో అందంగా నిలబెట్టి వున్న సీసాల నుంచి రెండు చాక్లెట్లను యివ్వమని అతన్ని అడుగుతూ, వీధిలోకి చూశాడు వాత్సవ.
''మీకు ఏదైనా అప్పుకు కావాలంటే నన్ను అడగవచ్చు... ఈ వీధిలో నివశించేవారందరూ నాకు బాగా తెలుసు'' చాక్లెట్లను తీసి అతనికి అందిస్తూ మరోసారి అన్నాడు ఆ బడ్డీ యజమాని.
వీధి మధ్యలో ప్రముఖంగా కనిపిస్తున్న డాక్టర్ జైన్ మేడను అతనికి చూపించాడు వాత్సవ.
''జైన్ సాబ్ కోసం వచ్చారా? పగటిపూట ఎక్కడెక్కడ తిరిగినా చీకటిపడిన మరుక్షణం ఇంటికి వచ్చేస్తారాయన. నా బడ్డీలో సిగరెట్ పాకెట్లను తీసుకుని మరీ పోతారు... మీరు వెళ్ళి గేటును గట్టిగా కదపండి'' జైన్ అలవాట్లు తనకు బాగా తెలిసినట్లు చకచకా చెప్పాడు బడ్డీ యజమాని.
''ఆయన ఇంట్లో వున్నట్లు కనిపించడంలేదు. ఢిల్లీ వెళ్ళినట్లు చెప్పారు ప్రక్క ఇంటి ఓనర్'' యధాలాపంగా అన్నాడు వాత్సవ.
''లేదు సార్... ఈరోజు ఉదయం ఆయనతో మాట్లాడాను నేను. రెండు మూడు రోజులదాకా ఇంట్లోనుంచి కదలనని చెప్పారు. తాము బయటికి రావటం కుదరకపోతే ప్రొద్దున్నే నాలుగు సిగరెట్ పాకెట్లను తెచ్చి తనకు యివ్వమని అడిగారు... అలాగే చేస్తానని కూడ అన్నాను...'' ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు బడ్డీ యజమాని.
డాక్టర్ జైన్ ఇంట్లో వున్నాడో, లేడో అన్న విషయం మీద వాత్సవ మనసులో ఏవైనా అనుమానాలు వుండివుంటే ఆ మాటలతో పూర్తిగా మటుమాయం అయిపోయాయి.
