• Gnapakala Golusu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • జ్ఞాపకాల గొలుసు

  Gnapakala Golusu

  Author:

  Pages: 128
  Language: Telugu
  Rating
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  '4/5' From 2 votes.
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  '4/5' From 1 premium votes.
Description

"నేను విశాలమైన ఒక పెద్ద బండపై నిల్చొని పచ్చిగా వచ్చే మట్టి సువాసనని గట్టిగా పీలుస్తూ, దూరంగా కనిపించే భద్రకాళి గుడిని, పక్కనే నిద్రిస్తున్న ఒక యోధుడి తలల కనిపించే పెద్ద గుట్టని, కట్టని, చెరువుని, వీటిని కమ్ముకొని ఉన్న దట్టమైన మంచుని, గుంపులు గుంపులుగా మెల్లగా పయనమవుతున్న పక్షుల్ని, నన్ను కౌగిలించుకునేందుకు వీచే ఈదురుగాలులను ఎదిరిస్తూ, చిన్నగా చలికి వణుకుతూ, క్షణ క్షణానికి రంగు మారుతున్న ఆకాశాన్ని చూస్తూ, కమ్ముకున్న పొగ మంచుల్ని చీల్చుకుంటూ ప్రశాంతంగా పుట్టుకొస్తున్న సూర్య తేజాన్ని కళ్ళు పెద్దవిగా చేసుకొని, ఆ సమ్మోహన దృశ్యాన్ని, మౌనంగా, మనసులో పదిలంగా దాచుకునే వాన్ని.."

"అక్కడి నుండి కొత్తకొండ బస్సు ఎక్కి చుట్టూ ఉన్న సుందర లావణ్యాన్ని చూస్తుండగా చల్లని ఈదురు గాలులకు దీటుగా బస్సు దూసుకుపోతుంటే వెచ్చటి అమ్మ ఒళ్ళో కూర్చొని కిటికీ నుండి చూడగా దూరంగా మంచుతో కప్పబడిన కొండలు ఏదో గ్రామంలో ప్రయాణిస్తున్నట్టు కాక ఊటీ కొడైకెనాల్‌కు వెళ్తున్న అనుభూతి కలిగేది (ఇప్పటికిను). మెల్లిగా చినుకులు పడుతుండగా పడిశం పడుతుందని అమ్మ కిటికీ మూసేది. నీటి తుంపర్లతో మసగ్గా మారిన కిటికీ నుండి చూడగా కనిపించే కొండలు వాటిని కప్పుకొని ఉన్న మంచు పొగలు, జోరుగా కురుస్తున్న వర్షం, ఈదురు గాలులకు వంగి పోతున్న చెట్లు, ముద్దైన పంటపొలాలు, అన్ని కూడా, ఓ చిత్రకారుడు గీసిన వర్ణ చిత్రం లాగ తోచేది. అప్పుడప్పుడు తళుక్కున మెరిసే ఆవులు, పొలం చివర్లో గట్టుపైన కట్టుకున్న గుడిసెలు, తడుస్తూ పరుగులు పెడుతూ పొలం బాయిల కాడ నా ఈడు పిల్లలు, మరి వెలుతురుగా కాక మరి చీకటిగా కాక మసక వెలుతురులో, అద్బుతమైన ప్రకృతి అందాలు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వంద మంది చిత్రకారుల వర్ణ చిత్రాలతో ఏర్పాటు చేసిన అతి పెద్ద సహజ గేలరీని చూస్తున్న అనుభూతి ఓ బస్సు కిటికీ ద్వారా కలిగేది."

"నా చూపు మాత్రం మా అమ్మ, పుట్నలమ్మ ముచ్చట్లలో కాక, పుట్నాలు బటానీల బుట్ట మీదే ఉండేది. పెద్ద బుట్టలో ఒక సంచిలో పుట్నాలు, మరో సంచిలో బటానీలు, ఇంకో సంచిలో కర్రెంటు వైరునీ కాల్చిన తర్వాత బయటపడే రాగి, ఇత్తడి తీగలు, బొమ్మలు ఉండేవి. ఒక పక్కన సద్ది టిఫును, ఒక చిన్న తరాజు, సుతిలి తాడుతో వేలాడదీసిన చిన్న అయస్కాంతం. సాధారణంగా డబ్బుకు కాకుండా, రాగి ఇత్తడి తీగలను తీసుకొని, దోసెడుతో ఇచ్చేది."

"అప్పుడుప్పడు పుట్నాలమ్మకి మా అమ్మ పాత చీర ఇస్తే, చీరను ప్రేమగా తాకుతూ కంట నీరు పెట్టుకునేది. నువ్వు సల్లగుండాలి అవ్వ అంటూ దండం పెడుతుంటే. ఇదంతా అమ్మ కొంగు చాటున నుండి తొంగి చూస్తుండే వాణ్ని. అప్పుడనిపించేది - మనుసులకి కావాల్సింది డబ్బు కాదు, ఒక మంచి మాట, చిన్న ఆప్యాయత, ప్రేమగా ఇచ్చే కాసిన్ని మంచినీళ్ళు. ఈ రకంగా మా అమ్మ దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని అందరికి సేవ చేసేది. ఆవును పట్టుకొని ఇంటి ముందుకొచ్చే జంగాయన నుండి మొదలు పెడితే, కూరగాయలు అమ్ముకునే పెద్దమ్మ, చీరల భద్రయ్య, వయసు పైపడి వంక కర్ర ఉతంతో పొద్దున్నే బన్ను రొట్టె తెచ్చే ఫాతిమమ్మ, మెడలు పట్టుకుంటే సరి చేసే డబ్బా కాడి అంటీ, పెద్దలకు బియ్యం ఇచ్చినప్పుడు, మా వీధి చివర్లో ఉన్న బాపనామే, పిరికెడు బియ్యం కోసం రోజు వచ్చే ఓ ముసలి తాత వరకు అందరు మా అమ్మ సేవకు ప్రతిఫలంగా మమ్మల్ని దీవించే వాళ్ళు. మా అమ్మ మాకు తెలియకుండానే మా మనస్సులో ఎన్నో విషయాలు నింపింది. అందుకేనేమో నాలో చదువుని, మనుషుల్ని నమ్మక కేవలం మనసుల్ని నమ్మాలనే భావన నాటుకుంది. ఆ భావనే ఇప్పటికి నను ముందుకు నడిపిస్తుంటుంది."

"సాధారణంగా అరటి పళ్ళు, ఇంట్లో ఎవలికైన జ్వరం వస్తే తప్ప కనిపించని దానిమ్మ కాయ, అప్పుడప్పుడు దొడ్డు సేమియా(అదే బంబినో) పాయసం. మా వాడలో, గుండం గల్లిల్లో, అంత ముస్లిములే, మా గల్లిలో ఉన్న ముసలోల్లంత తుర్క వాడ అనేటోలు. మా ఇస్కులు దోస్తులంత ముస్లిం అని పిలువాలి అని మారం సేయడంతో నేను మాత్రం ముస్లిమోళ్ళ గల్లి అని పిలిచేవోన్ని. రంజాన్ పండగొస్తుందంటే సాలు రకరకాల పళ్ళు, పళ్ళ రసాలు, ఖజ్జురాలు, మిఠాయిలు, ఖీర్ పాయసం, హాలాల్ చేసిన మాంసం, దం బిర్యాని, పుల్క, రుమాల్ తందూరి, నాన్సు రొట్టెలు ఎక్కడ లేని తిండంత గాన్నే గా ఇఫ్తార్ విందులల్ల ఉండేది. ఎందుకో మాంసం తినకపోయేటోన్ని. కాని నా శక్తి మేర పళ్ళు, పళ్ళ రసాలు, ఖజ్జురాలు, పాయసం ఫుల్లుగా తీసుకొని పొట్టి నేక్కర్లేసుకున్న మేము పెద్దోల్లలాగా ముందు నా పొట్టను పంపిస్తూ వెనకాల నేను నడిచేవోన్ని."

"ప్రతి రోజు పట్టు లంగా, ఒత్తుగా పొడుగ్గా ఉండే రింగుల జుట్టుని సగానికి విడతీసి రెండు జడలని పాయలుగా అల్లుకొని మడిచి మాచింగ్ రిబ్బన్లను కట్టుకొని ఒకరోజు కనకాంబరం, మరో రోజు మల్లెపూలు, ఇంకో రోజు చిన్న చామంతులు, గులాబీలు, మందార, బొడ్డుమల్లె, సెంటుమల్లె ఇలా ఏ రోజు కూడా తలలో పూలు లేకుండా కనిపించేది కాదు. నుదుట టిక్లీ దానికింద రెండు బొమ్మల మధ్య చిన్నగా కుంకుమ, నుదురు మధ్యన అడ్డంగా చిన్న తెల్ల బొట్టు, కను రెప్పల నిండుగా చిక్కని కాటుక, చెవులకు దుద్దులు, ఒక్కోసారి ఊగుతూ ఉండే చిన్న కమ్మ బుట్టాలు చూపు తిప్పుకోలేని సుందర లావణ్యం తన రూపం, పేరు శ్యామలే కాని రంగు ఎరుపే. ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్నాననే గర్వం తన నానమ్మ చెప్పే మాటలతో తెచ్చుకుంది."

"వేలాడదీసిన తెల్ల బూట్లు నన్ను చూసి వెకిలిగా నవ్వుతున్నాయి. ఏంటో చిన్నప్పటినుండి "సరోజనమ్మ పిల్లలు చూడు తల్లి చెప్పినట్టు ఇంటరు" అని వాడ వాడ మొత్తం కలిసి ఇచ్చిన బిరుదుని మోసుకుంటూ ఉన్న నాకు అది గుర్తుకురావడంతో ఎక్కడ ఆ బిరుదుని పొడగోట్టుకుంటానో అని, “అమ్మ మా టీచర్ కొడుతది నాక్కూడా కావలి తెల్ల బూట్లు” అని నోరు తెరిచి అడగలేక పోయా.. ఆయినా తనకి తెలియదా నాక్కూడా కొనాలని, డబ్బులు సరిపోలేదు అని నాకు నేను సర్దిపుచ్చుకుంటున్న కూడా, లోలోపల దుఃఖం తన్నుకుంటూ వస్తుంది. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ భారంగా పడుతున్నాయి నా అడుగులు. అమ్మ బుదరకిస్తూ ఏమోమో చెప్తుంది కాని ఒక్కటి కూడా వినపడట్లేదు."

"ఇంటెనక కట్టెల పోయి దగ్గర ములుగు రోడ్డులో మొన్న అంటే అంతకు మూడు రోజుల క్రితం పట్టుకొచ్చిన రెండు మండ్ల కట్టెలను పొద్దంత ఎండలో ఎండబెట్టింది అందులో నుండి ఓ నాలుగు కట్టెల్ని తీసుకొచ్చి పిడక మీద కొంచెం కిరోసిన్ పోసి వెలిగించి, మెల్లగా పొయిలో పెట్టి ఆ చిన్న మంట మీద ఒక్కొక్క కట్టె పేడులను పెడుతూ మెల్లగా గొట్టంతో ఊదుతూ, కట్టెలకు మంట అందుకున్నాక మొక్కజొన్న గడకని కడిగి నీటితో నింపిన గిన్నెను మండుతున్న కట్టెల పొయ్యి మీద పెడుతుంటే, పేడతో అలుకు జల్లిన నేలపై నిక్కరు సర్దుకుంటూ కూసొని, చుట్టూ చీకటి వెలుగుతున్న పొయ్యి మంట వెలుతురు, మసగ్గా కనిపించే వెన్నల వెలుతురు, అప్పుడప్పుడు వీచే వేప చెట్టు గాలి మా అమ్మ పక్కనే మా అక్క కొంచెం ఎడంగా చిన్న ఉప్పు డబ్బా, పోయి మీద నుండి గిన్నె దింపడానికి సిద్ధం గున్న మసిగుడ్డ దానితో ఆడుకుంటూ నేను నా పక్కనే అయిపోయిన టానిక్ సీసాలో కిరోసిన్ పోసి దాని మూతకి చిన్న రంధ్రం చేసి సన్నని గుడ్డ పీలిక మొదలుని వొత్తిగా చేసి మిగతా గుడ్డని సిసలోకి ముంచి మూత పెట్టి వెలిగించిన చిన్న దీపం. ఇక నేను మండుతున్న నిప్పులవైపు, గిన్నెలో ఉడుకందుకుంటున్న గడకవైపు చూస్తూ అమ్మ అక్క ముచ్చట్లు పెట్టుకుంటుంటే వింటూ ఉండేవొన్ని, కాసేపటికి పప్పు దువ్వ వెనక భాగంతో గడక ఉండలు కట్టకుండా తిప్పుతుంటే తెల్లని పొగలు మెరుస్తూ వంకర్లు తింకర్లుగా గాల్లో కలిసిపోతుంటే అలాగే చూస్తుండేవొన్ని. "

"ఆ రోజు రాత్రి వర్షాకాలానికి స్వాగతం చెప్తూ చిన్న తుంపర్లతో మొదలై చక్కని జల్లు కురిసింది. మాది పెంకుటిల్లు. మేమేసుకున్న పక్కలు తడవకుండా పెంకు రంధ్రాల్లో నుండి కురుస్తున్న నీటి చుక్కలు పడుతున్న చోటులో గిన్నెలు తపాలలు పెడుతుండేది మా అమ్మ. నేను ఇంటి బయట దర్వాజాకు ఒక్క రిక్క తలుపు ఉండేది దాని గొళ్ళెం తీసి చీకటి నిశ్శబ్దం లో కమ్మగా వినిపించే వర్షపు రాగాన్ని వింటూ గూన పెంకు వాలు నుండి ధారగా పడుతున్న నీటి వరుసుల్ని దీపం వెలుతుర్లో చూస్తూ, అప్పుడప్పుడు మెరిసే మెరుపు ఉరుములకి ఉలిక్కి పడుతూ తీయని మట్టి సువాసనలు ఆస్వాదిస్తూ అల ఎప్పుడు పడుకునే వాన్నో.... తెల్లారి లేచి చూస్తే మాత్రం దుప్పటి ముసుగులో ఉండేవాన్ని (దాదాపు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇలా వర్షం చూస్తూ నిద్ర పోవడం అమ్మ ఎత్తుకొచ్చి పక్కలో పడుకోబెట్టి దుప్పటి కప్పడం సర్వ సాధారణం)."

"మెడలు వంచి సిగ్గుతో అల్లాడిపోతున్న ఓ నగ్న యువతిలా ఎంతో సున్నిత సుకుమారంగా నేలలోనుంచి పురుడు పోసుకుంది... మా చిక్కుడు మొక్క. అంతే........ నా ఆనందానికి అవధుల్లు లేవు. ఒక్క పరుగున వెళ్లి "అమ్మ మొక్క మొలిచింది రా సూడు".. అని చేయి పట్టుకొని లాక్కొచ్చాను అమ్మని. నా మాటకి కట్టగట్టుకొని అందరం. ఆకరికి భారికాయమేసుకున్న మా బాపమ్మ కూడా ఉ... ఉ... అని మూలుగుతూ రైక సరి చేసుకుంటూ కొంగు మీదేసుకుని మరి వచ్చి చూసింది. ఇక మా అమ్మ మంచిగా పెరగాలని దీవిస్తూ ఆ మొక్క చుట్టూ మట్టితో అద్దులు పెట్టి సరిచేసింది."

"మా బాపు తాగోస్తే పిచ్చోడే గాని ఉత్తప్పుడు ఆయనంత మంచి మనిషి ఇంకోడు లేనేలే.. ఎన్ని చేసిన ఏం చేసిన తాగుడు లేనపుడు మాతో మెదిలే బాపు తీరు మస్తు సరదాగుంటది. ఇంత సరదా అయిన మనిషిలో రాక్షసుడు ఎలా తిష్ట వేసాడో అని అనుకోని సందర్భం లేదు. బహుశా తాగుడనే శాపం పట్టుకొని తననిలా అనుక్షణం కాల్చుకు తింటుంది. "

Preview download free pdf of this Telugu book is available at Gnapakala Golusu