-
-
గిడుగు - పిడుగు
Gidugu Pidugu
Author: Dr. Vedagiri Rambabu
Publisher: Sri Vedagiri Communications
Pages: 100Language: Telugu
'వ్యావహారిక భాష' అనగానే మనకు గుర్తుకొస్తారు గిడుగు వేంకటరామమూర్తి పంతులుగారు. వ్యావహారిక భాషోద్యమంలో కీలకపాత్ర వహించి, నలభై సంవత్సరాలకు పైగా గ్రాంథికవాదులతో పోరాడి, వ్యావహారిక భాషకు పట్టం కట్టారు. తెలుగు సాహిత్యం అందరికీ అందుబాటులోకి రావాలంటే మాట్లాడుకునే భాషలోనే రచనలు సాగాలన్నది ఆయన వాదన. బోధనాభాషగా కూడా వ్యావహారిక భాష ఉండాలన్నది ఆయన ఆశ. అందుకోసమే ఆయన తన జీవితాన్ని వెచ్చించారు. బోధనా పద్ధతులలో మార్పుకి కృషి చేసిన ఈ ఆధునిక భాషాశాస్త్రవేత్త తెలుగులో మొదటి ఆధునిక భాషా విమర్శకులు. సవరలకు, సవర భాషకు ఎన్నో సేవలందించారు. రాష్ట్ర ప్రభుత్వం గిడుగువారి జన్మదినం -ఆగస్టు 29న-తెలుగుభాషా దినోత్సవంగా ప్రకటించింది. అటువంటి, మహనీయుడు గురించి తెలుగువాళ్ళందరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. అందుకే ఈ చిరుప్రయత్నం.
గిడుగువారి 150వ జయంత్యుత్సవాల్ని రాష్ట్రవ్యాపితంగా జరపాలనే ఉద్దేశంతో నేను, భాషోద్యమ సమితి సామల రమేష్బాబుగారు కలసి పర్లాకిమిడి(ఒరిస్సా)నుంచి ప్రారంభించి విజయనగరం, గజపతినగరం, విశాఖపట్నం, రాజమండ్రి, కొవ్వూరు, తణుకు, విజయవాడ, తెనాలి, చెన్నై, చౌడేపల్లి, హైద్రాబాద్‌లలో సభలని నిర్వహించాము. ఆ సందర్భంలో ఆయనను గురించిన అవగాహన నాలో పెరిగింది. వెళ్ళిన చోటల్లా గిడుగువారి రచనలను సేకరించి, సమగ్ర సాహిత్యాన్ని రెండు సంపుటాలుగా ప్రచురిస్తామన్న తెలుగు అకాడమీకివ్వడం జరిగింది. దాదాపు అవసానదశలో ఉన్న, పట్టుకుంటే పిండైపోతున్న నాటి గిడుగు రామమూర్తి రచనల్ని మాకందించంలో సహకరించిన డా. జి.నాగేశ్వరరావు, పంతులు (పర్లాకిమిడి), డా. అల్లంసెట్టి చంద్రశేఖర్ (పొందూరు), సత్యప్రసాద్, కళాగౌతమి మూర్తి (రాజమండ్రి), కథా నిలయం (శ్రీకాకుళం), సామల రమేష్‌బాబు (విజయవాడ), వేదం సూర్యప్రకాశమ్ (నెల్లూరు) గార్లకు ఎంతో రుణపడి ఉన్నాను.
గిడుగు సంపూర్ణ సాహిత్యాన్ని రెండు గ్రంథాలుగా తీసుకురావడానికి తమవంతు కృషి చేస్తున్న తెలుగు అకాడమి డిప్యూటీ డైరెక్టర్ డా. ఎం.మాణిక్యలక్ష్మి గారికి, అరుంధతి గారికి... అలాగే డా. పోరంకి దక్షిణామూర్తి, శ్రీయుతులు విహారి, గిడుగు రామకృష్ణారావు, డా. అల్లంసెట్టి చంద్రశేఖరరావు,డా. ఎన్.ఎస్.రాజుగార్లతో గిడుగువారి గురించి ముచ్చటించడం జరిగింది. వాళ్ళు చెప్పిన మాటల్లోంచి, చదివిన గ్రంథాల వ్యాసాలలోని విశేషాలతో 2014 గిడుగు జన్మదినం నాటికి అంటే ఆయన 151వ జన్మదినం నాటికి, ఆధునిక తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ చిరుగ్రంథాన్ని తీసుకువస్తున్నాను. శలవ్!
- వేదగిరి రాంబాబు
