-
-
జెంఘిజ్ ఖాన్
Genghiz Khan
Author: V. Yan
Publisher: Navachetana Publishing House
Pages: 358Language: Telugu
నింగిలో డేగకి రెక్కల్లేకపోతే శక్తి లేదు. నేలమీద మనిషికి గుర్రం లేకపోతే బలం లేదు.
ప్రతిదానికీ దాని కారణం వుంటుంది. తాటికి మొదలు వుంటే తుద వుంటుంది. ప్రపంచ మహత్తర పథంమీద పోయే బాటసారి సరియైన దారి పట్టుకుంటే లక్ష్యం అందుకుంటాడు. కాని ఒక్క తప్పు దారి లేక అజాగ్రత్త - చాలు, అతను గ్రహచారం మూడిన గహనాటవిలో తప్పిపోయినట్టే.
మనిషికి యేదేనా అసాధారణ విషయం తటస్థ పడితే - ఓ నగరం అదృశ్యం అయిపోయే, ఓ అగ్ని పర్వతం పేలుడు, ఓ సర్వశక్తిమంతుడైన పాలకుడి మీద తాడిత ప్రజానీకం తిరుగుబాటు చెయ్యడం, లేదా నోటితో అనుకోలేని అనాగరిక జాతితన మాతృ దేశంమీద దురాక్రమణ దాడి చెయ్యడం: ఇలాంటి విషయాన్ని మనిషి చూస్తే కాగితంమీద పెట్టెయ్యాలి. ఒకవేళ తనకి గనక రాసే అలవాటు లేకపోతే అతను తన కథని ఓ చెయ్యి తిరిగిన రచయితకి చెప్పాలి, అతను దాన్ని భవిష్యత్తరాల కోసం నగిషీ మాటలలో నిలుపుతాడు. మహత్తర విషయాలు దర్శించి వాటిని నిశ్శబ్దంగా దాచుకునే వాడు - మృత్యువు శీతహస్తం అప్పటికే అతని భుజం తడుతున్నప్పుడు విలువైన వస్తువుల్ని యెవ్వరికీ తెలియని ఓ యేకాంత స్థలంలో కప్పెట్టి దాచుకునే పిసినారి లాంటి వాడు.
కాని నేను కలం సిద్ధం చేసుకుని సిరాలో ముంచి సందేహంలో పడ్డాను, ఆలోచనలో ములిగిపోయాను. నిర్దాక్షిణ్యంగా దేశదేశాల్ని నాశనం చేసిన జెంఘిజ్ ఖాన్ని, అతని బర్బర సైన్యాల్ని కళ్లకు కట్టినట్టు చిత్రించే మాటలు నాకున్నాయా? నాకా శక్తి వుందా? ఉత్తర ప్రాంతపు ఎడారులనుంచి ఈ ఆటవిక సమూహాలు చేస్తూ వచ్చిన దండయాత్రలు భయంకరమైన సంఘటన. అలుపెరుగని అశ్వాలమీద ప్రశాంత మవరాన్నహార్, ఖోరెస్మ లోయలనుంచి అప్రతిహతంగా ఉరకలు పెడుతూ, తమ అగ్రభాగాన జేగురుగడ్డం నాయకుడు వుండగా, తమ వెనక ఖండించిన చీల్చిన మృత కళేబరాలని అసంఖ్యాకంగా వదిలిపెడుతూ ఈ మూకలు పోతూవుంటే మనుషులు ఒకళ్ల కళ్లు ఇంకొకళ్ళు చూస్తూ మళ్లీ యెన్నటికైనా దగ్ధమైన గ్రామాల పొగలు కమ్మి మసకైపోయిన ఈ ఆకాశాన్ని చూస్తామా లేదా ఇప్పటికే ప్రపంచ ప్రళయం చేరుకున్నామా అని ప్రశ్నించుకున్న సంఘటన అది.
మంగోలుల దండయాత్రల గురించీ, జెంఘిజ్ ఖాన్ని గురించి నేను తెలుసుకున్న వాటినీ, విన్న వాటినీ చెప్పమని చాలా మంది నన్ను అడిగారు. నేను చాలా కాలం సందేహించాను. మౌనంగా వుండడంలో ఉపయోగం లేదని ఇప్పుడు నేను గ్రహించాను. ప్రపంచంలో యెన్నడూ కనీవినీ యెరుగని ఆ ఘోర విపత్తుని గురించి చెప్పాలనే నిర్ణయించుకున్నాను. అది సర్వ మానవాళినీ కమ్మేసింది. ముఖ్యంగా ఈ క్షేత్రాలని కమ్మింది, పీడిత దురదృష్ట ఖోరెస్మ.
ఇక్కడ నేను ఆపాలి; నేను చెప్పింది చాలు. నేను వర్ణించింది అంతా నిజంగా జరిగిందని వృద్ధులు సాక్ష్యం చెప్తారు.
ఓపిగ్గా నాతో చివరిదాకా రండి. మీకే తెలుస్తుంది. జ్ఞానం అన్వేషించే వాడికి అది లభ్యమవుతుంది.
- వి. యాన్
