పాంటు జేబులోంచి కత్తిని వేగంగా బయటికి లాగి, దాని గుండెల మీద పొడిచాడు.
జనపనార పీచుల కంటే మందంగా వున్న రోమాల మూలంగా అతను ఆశించిన స్థాయిలో పడలేదా పోటు... స్వల్పంగా అయింది గాయం... అధికం అయిపోయింది ఎలుగుబంటి కోపం.
గావురుమని అరిచి కుడి పంజాను బలంగా విసిరింది అది... గింగిరాలు తిరుగుతూ ఎటో ఎగిరిపోయింది జగన్ చేతిలోని కత్తి.
కరెంట్ షాక్ కొట్టినట్లు మొద్దుబారి పోయిన కుడి చేతిని గుండెలకేసి అదుముకుంటూ అమాంతంగా ఎగిరి, బండరాయి మీది నుంచి క్రిందికి దూకేశాడతను. శరీరంలో వున్న శక్తినంతా పాదాల్లోకి తెచ్చుకుంటూ పరుగు ప్రారంభించాడు.
అతను చేసిన గాయంలో నుంచి రక్తం ధారలు ధారలుగా కారుతున్నా లెక్కచేయకుండా వెంటబడింది ఆ ఎలుగు.
అడ్డువచ్చిన బండరాళ్ళ మీది నుంచి ఎగిరెగిరి దూకుతూ, వింటి నుంచి వెలువడిన బాణంలా సూటిగా ఒక లోయలోకి పోయాడు జగన్.
క్షణాలు గడిచినకొద్దీ తగ్గిపోతున్నది అతనికీ ఎలుగుకు మధ్యలో వున్న దూరం...
ఉన్నపళంగా గాలిలోకి ఎగిరి అతని భుజాల మీదికి దుమకాలనే కోరిక వున్నట్లు దారుణమైన శబ్దాలు చేస్తూ వస్తోంది అది.
ప్రాణాలమీది ఆశని వదిలేసుకున్నాడు జగన్. తన చేతకానితనాన్ని క్షమించమని ఎక్కడో వున్న డి.జి.పి. గారిని, డాక్టర్ సాబ్‌ని మనసులోనే మన్నింపు కోరుతూ, దట్టంగా వున్న ముళ్ళపొదల మధ్య నుంచి, ఎత్తయిన ఒక బండవైపు తిరగబోతుండగా-
