-
-
ఏనుగంత తండ్రికన్నా యేకులబుట్టంత తల్లి నయం
Enuganta Tandrikanna Yekulabuttanta Talli Nayam
Author: Gogu Shyamala
Publisher: Hyderabad Book Trust
Pages: 112Language: Telugu
సూర్యగ్రహణాన్ని వర్ణించనీ చావడి దగ్గర చేరిన గ్రామస్తులను గురించి చెప్పనీ, బర్రెమీద సవారీ చేసే పల్లెటూరి పిల్లను గురించి చెప్పనీ, దళితులు కొట్టే డప్పు చప్పుడులోని వివిధ దరువులను పరిచయం చేయనీ.... గోగు శ్యామల కథనంలో వుండే మంత్ర శక్తి ఒకే స్థాయిలో వుంటుంది. దానికి పరిమితులు లేవు, ఆమె మనకు ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని చూపిస్తూనే విశాల విశ్వంలోకి నడిపిస్తుంది. ఒక్కసారిగా బాల్యంలోకి పరుగుతీసి అవధులూ ఆకాంక్షలూ ఎరుగని అమాయకపు కళ్ళతో దళిత జీవితాన్ని మన ముందుకు తెస్తుంది. దళితుల రోజువారీ జీవితాన్ని వివరంగా కళాత్మకంగా ఎంతో చాతుర్యంతో కళ్ళకు కట్టిస్తుంది.
ఈ కథలకి నేపథ్యం ఒక తెలంగాణ గ్రామంలోని మాదిగ వాడ. అక్కడి వివిధ సందర్భాలనూ, సన్నివేశాలనూ, జనం అనుభవాలనూ చిత్రిస్తూ వాటిని అవగాహన చేసుకునే ఒక కొత్త చూపును పాఠకులకు ప్రసాదిస్తుంది.
పూర్వపు రచనలలో అటువంటి ప్రదేశాలను, ప్రజలను వర్ణించడానికి ఉపయోగించిన భాష గురించి, వాటి పట్ల ఆ రచనలలో కనబడిన భావుకత, పరిపాలనా దృక్పథం, గాంధీత్వ దృష్టి గురించి చెపుతున్నప్పుడు ఆమె చమత్కారం చాలా నవ్వు తెప్పిస్తుంది. ఈ కథల పరిష్కారాలు ఊరి నుంచి, మాదిగవాడ నుంచి, అటువంటి ఇతర సమూహాల నుంచి మనుష్యుల్ని బయటికి పంపించడంలో లేదు. అక్కడి జనజీవితాన్నే భవిష్యత్ ఆశగా చూపించే కథలు ఆమెవి.
