జగద్గురువు లయకారుడు అయిన శివుడు మనదేశంలో ఎన్నో దివ్యక్షేత్రాల్లో పుణ్యతీర్థాలలో వివిధ రూపాల్లో కొలువున్నాడు. శివారాధన అత్యంత ప్రాచీన కాలం నుంచీ మనదేశంలో ఉన్నది. ఆసేతు హిమాచలం ఎన్నో శైవక్షేత్రాలు నిత్యం వేలాది భక్తులతో కళకళలాడుతూ వుంటాయి. ఇలా ప్రతి శైవక్షేత్రం తమతమ ప్రత్యేకతని, వైశిష్ట్యాన్ని కలిగి వున్నప్పటికీ, పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపుడుగా వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలకి మనదేశంలో ఎంతో విశిష్ట స్థానం ఉన్నది.
ఈ జ్యోతిర్లింగాలు అనేవి మునులు, ఋషులు, రాజులు ప్రతిష్టించినవి కావు. సాక్షాత్తు సదాశివుడు తన ఆత్మజ్యోతితో స్వయంభూగా వెలసిన దివ్యక్షేత్రాలు. అందుకే జ్యోతిర్లింగాలని ఒక్కసారి దర్శిస్తే చాలు, అనంతమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు ఘోషిస్తాయి. అందుకే పాఠకులందరికీ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించిన విశేష సమాచారాన్ని ఈ గ్రంథం ద్వారా అందిస్తున్నాము.
ఈ గ్రంథంలో ద్వాదశ జ్యోతిర్లింగాల విశేషాలతో పాటు, శివుడు పంచమూర్తులుగా నిలచిన అమరారామం, ద్రాక్షారామం, కుమారారామం, క్షీరారామం, సోమారామాలనే పంచక్షేత్రాల గురించి, అలాగే పృథివి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచ భూతాలకు ప్రతీకలుగా నిలిచిన సర్వేశ్వరుడి పంచభూతలింగ దివ్యక్షేత్రాలైన శ్రీ ఏకామ్రనాథ, శ్రీ జంబూకేశ్వర, శ్రీ అరుణాచలేశ్వర, శ్రీ కాళహస్తీశ్వర, శ్రీ చిదంబరేశ్వర స్వామివార్ల సమాచారాన్ని కూడా అందిస్తున్నాము.
వీటితో పాటు శివభక్తులకు నిత్యపారాయణకు అనుగుణంగా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం, దారిద్ర్యదహన స్తోత్రం, శివస్తుతులు, శివుడి అష్టోత్తర శతనామ, సహస్రనామ స్తోత్రాలు కూడా అనుబంధంగా ఇస్తున్నాము.
శివభక్తులందరినీ ఈ గ్రంథం అలరిస్తుందని ఆశిస్తూ, నమస్కారాలతో....
- ప్రకాశకులు
