-
-
దేవుడులాంటి మనిషి - 2
Devudu Lanti Manishi Volume 2
Author: U. Vinayaka Rao
Publisher: Jaya Publications
Pages: 315Language: Telugu
’దేవుడులాంటి మనిషి’ పేరుతో నేను ప్రారంభించిన అక్షర క్రతువు వయసు ఇది. మధ్యలో కొన్ని అవాంతరాలు, అడ్డంకులు ఎదురైనా నిరుత్సాహపడకుండా వాటిని అధిగమించి అనుకున్న విధంగా పూర్తి చేయగలిగాను. ‘ఎప్పుడో మొదలుపెట్టావు.. ఇంకా కాలేదా?’ అని ఆప్యాయంగా ఆరాతీసే నా మిత్రులు, ‘సార్... మా హీరోగారి పుస్తకం ఎప్పుడు?’ అని ప్రశ్నించే హీరో కృష్ణ అభిమానులు... నా కలం పరుగుని కొంత పెంచినప్పటికీ ఏ దశలోనూ రాజీపడకుండా నేను అనుకున్న విధంగా ఈ పుస్తకానికి ఓ అందమైన రూపం తీసుకొచ్చాను.
తెలుగు సినిమా అభివృద్ధికి ఎంతో కృషిచేసిన విశిష్ఠ వ్యక్తుల గురించి, వారి గొప్పతనం గురించి భావితరాలకు తెలియజెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీనియర్ ఫిలిం జర్నలిస్ట్‌గా అది నా బాధ్యత కూడా. అందుకే ‘లెజెండ్రీ పర్సనాలిటీస్’ లైఫ్ హిస్టరీని అక్షరబద్ధంచేసి, వారి పేరుని చిరస్థాయిగా నిలబెట్టాలని నిర్ణయం తీసుకొని ముందడుగు వేశాను. ఈ పరంపరలో నేను అందిస్తున్న తొమ్మిదో పుస్తకం ‘దేవుడులాంటి మనిషి’. సూపర్‌స్టార్ కృష్ణ గురించి ఇంతవరకూ ఎన్నో పుస్తకాలు వచ్చినా, వాటికి మిన్నగా, భిన్నంగా ఉండేలా ఈ పుస్తక రూపకల్పనలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను.
హీరో కృష్ణ గురించి చెప్పాలంటే చాలా ఉంది. అదృష్టం అడ్రస్ అన్వేషిస్తూ చాలామంది బయలుదేరుతుంటారు. కానీ కొందరిని మాత్రమే అదృష్టం వెతుక్కుంటూ వచ్చి అందలం ఎక్కిస్తుంది. అటువంటి వారిలో ముందు వరుసలో ఉండే వ్యక్తి హీరో కృష్ణ. నటుడుగా ఆయన యాభై ఏళ్లు కొనసాగారంటే నటనతో పాటు ఆయన మంచితనం కూడా కారణం. ‘సినీరంగంలో మంచివాళ్లు ఎవరున్నారయ్యా.. కృష్ణలాంటి ఒకరిద్దరు తప్ప’ అని మహాకవి శ్రీశ్రీ అనడం కృష్ణ వ్యక్తిత్వానికి నిదర్శనం. కృష్ణ నటనని విమర్శించే వారు ఉండవచ్చేమో కానీ ఆయన వ్యక్తిత్వాన్ని వేలుపెట్టి చూపించే వారు మాత్రం ఉండరు. ఎన్టీఆర్, ఏయన్నార్ యుగంలో కూడా తనదైన ప్రత్యేకతను నిలుపుకున్న వ్యక్తి కృష్ణ. తెలుగు సినిమా వయసు 82 ఏళ్లయితే, అందులో కృష్ణ వాటా 50 ఏళ్లు.
హీరో కృష్ణ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత తెరపై సాహస ప్రయోగాలు, అందుకు సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని చాలామంది చెబుతుంటారు. అది వాస్తవం కూడా. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక కొత్త చరిత్ర సృష్టించడానికే కృష్ణ అవతరించారా అనిపిస్తుంది కొన్ని సంఘటనల గురించి తెలుసుకున్నప్పుడు. నిర్మాతగా కృష్ణ తీసినన్ని వైవిధ్యమైన చిత్రాలు, హీరోగా ఆయన చేసిన సాహసాలు మరెవరూ చేయలేదనడం అతిశయోక్తి కాదు. ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం అన్వేషిస్తూ, వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తూ పరిశ్రమకు మార్గదర్శకంగా నిలిచారు. మంచితనం, మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిగా, ధైర్యసాహసాలే ఊపిరిగా జీవించే నాయకునిగా, సంచలన నిర్మాతగా కృష్ణ పేరు తెచ్చుకున్నారు. వివాదాలకు దూరంగా ఉండటం ఆయనకు మొదటి నుంచీ అలవాటు. అందరూ తనవారేనని నమ్మే మనస్తత్వం ఆయనది. నిర్మాత నష్టపోతే తనే నష్టపోయానని భావించే వ్యక్తి. ఐదు పదుల నట జీవితంలో 365 చిత్రాల్లో నటించిన ఘనత ఆయనది. అందుకే ఆయన గొప్పతనాన్ని చాటుతూ, ఆయన సాహసాన్ని అడుగడుగునా గుర్తు చేస్తుంది ‘దేవుడులాంటి మనిషి’ పుస్తకం.
- వినాయకరావు
ఈ ఈ-పుస్తకాన్ని రెండు భాగాలుగా తీసుకొస్తున్నాం. రెండవభాగంలో కృష్ణగారి రీమేక్ చిత్రాలు, సాంఘిక చిత్రాలు మరియు సినీరంగానికి చెందిన పలివురు ప్రముఖులు ఆయనను అభినందిస్తూ రాసిన విషయాలను గూర్చి వివరించటం జరిగింది.
గమనిక: " దేవుడులాంటి మనిషి - 2 " ఈబుక్ సైజు 35mb
అభినందనలు ...సూపర్ స్టార్ కృష్ణగారి గురించి వినాయకరావు గారు చెప్పింది అక్షరసత్యం. కృష్ణగారితో కొద్దిపాటి పరిచయంలో ఇది అర్థమైంది.ఇలాంటి పుస్తకాల అవసరం ఎంతైనా వుంది.ఇది కేవలం కృష్ణగారి ఆటోబయోగ్రఫీ మాత్రమే కాదు వ్యక్తిత్వవికాస పుస్తకం కూడా..ఎందరికో స్ఫూర్తిని ఇచ్చే పుస్తకం .సినిమా జర్నలిస్ గా పాతికేళ్లుగా వినాయకరావు గారు తెలుసు..తనలోని రచయిత చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం...కృష్ణగారి అభిమానులే కాదు జీవితాన్ని ఛాలెంజ్ గా స్వీకరించే ప్రతీ ఒక్కరూ చదవవలిసిన పుస్తకం. ‘దేవుడులాంటి మనిషి’ పుస్తకం.
విజయార్కె www.manrobo.com