-
-
దీప వృక్షం
Deepa Vriksham
Author: Dr. Kovela Suprasannacharya
Publisher: Srivani Prachuranalu
Pages: 92Language: Telugu
ఈ గ్రంథము నా అంతరంగ బంధువులలో ఒకడైన చిరంజీవి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారి రచన. ఇది ఒక కథ కాదు, నాటిక కాదు, ఒక ఉపన్యాసము కాదు, వ్యాస సంపుటి కాదు ఒక సిద్ధాంత ప్రవచనము కాదు.
ఒక వ్యక్తి తన ఆవరణలో అచేతనంగా నిద్రించి, సుషుప్తిని, స్వప్నాన్ని, తెలివిలో అనుషంగాలను విసర్జించి స్వయంసమృద్ధిని, స్వాతంత్ర్యాన్ని ఆర్జించే యత్నం ఆరంభించాక, తాను పూర్వరంగంలో అనాలోచితంగా సహజంగానే చూచిన ప్రపంచము సరిక్రొత్తగా అర్థమవడం మొదలెడుతుంది. అనేక వస్తువులు, వ్యక్తులు, సంఘటనలు, బాంధవ్యాలు నేటివరకూ ఉన్న అనుభవాలు అన్నీ ఈ క్రొత్త చైతన్యం లోంచి చూడడం మొదలుపెడతాడు. తన పూర్వపు వ్యక్తిత్వాన్ని కూడా ఈ నూతన వ్యక్తి చూడడం మొదలు పెడతాడు. దాని కొక ఉపక్రమోపసంహారములు ఉండవు (Random Observations). ఆ భావతరంగాలే ఈ గ్రంథం. ఈ నిర్ణయాలు, నిర్వచనాలు, అర్థాలన్నీ అంతిమసత్యాలుగా భావించ నక్కరలేదు. ఆ భావుకుడే దానికి ఇంకా తుదిమెరుగులు పెట్టవచ్చు. అది అతడి ప్రస్థానంలోని మజిలీలని బట్టి ఉంటుంది. అందువల్ల అది నిరంతరం.
చిరంజీవి సుప్రసన్న దీనికి 'దీపవృక్ష'మని పేరు పెట్టారు. దీపవృక్షమంటే దీపస్తంభము అని అర్థం. దీపము అంటే లత అనే అర్థం కూడా ఉన్నది. ఆలయ ప్రాంగణంలో ఒక స్తంభాకారాన్ని నిర్మించి, దాని నిండా దీపాలు అమరుస్తారు. దీపాలు వెలిగించనపుడు అది ఒక అచేతనమైన శిలామూర్తి. మానవ శరీరంలో మూలాధారం నుండి సహాస్రారం వరకూ ఒక దీపవృక్షమున్నది. ఇడా, పింగళలు సుషుమ్మ చుట్టూ లతగా పైకి ఎగబ్రాకి ఉన్నాయి. మూలం నుంచి చైతన్యం మేలుకొన్నాక ఈ లతలతో సహా ఆద్యంతము ఈ దీపస్తంభం వెలుగులతో నిండుతుంది. అది ఈ క్షుద్ర బ్రహ్మాండమైన మానవశరీరంలో బ్రహ్మాండాన్ని ఆవిష్కరింప చేసుకోవడం అన్నమాట. ఆ సాధకయోగి పరమావధి. ఆ మార్గమధ్యంలో ఎన్నో మినుకులు, వెలుగులు. అంతా ప్రస్థానమే. అలాంటి ప్రస్థానంలో ఉన్న మరొక ఆప్తునికి ఒక లేఖగా దీన్ని భావించినా అది సత్యమే కాగలదు. ఇది చదివి మిక్కిలిగా ఆనందించినాను.
- శివానందమూర్తి
