''తనకు నిద్రతో అవసరం లేదన్నాడు, దుష్టశిక్షణ చేయటానికి అవతరించిన తను ఇక ఒక్క క్షణం కూడ ఆలస్యం చేయకూడదని ఆ వార్డునంతా కలియచూచి ఒక మూలగా బ్డ్మీద కూర్చుని వున్న నా ఫ్రెండ్‌ని గమనించాడు. వెర్రిగా నవ్వాడు.
''పిచ్చివాళ్ళ నవ్వుకు అర్థాలుంటాయా? వాళ్ళు వెర్రిగా నవ్వక మామూలుగా నవ్వగలరా?''
''అది పిచ్చివాడి నవ్వు కాదు. నవ్విన తరువాత నా స్నేహితుడు తనకు బాగా పరిచయం ఉన్నట్లు మావాడు గతంలో చేసిన వెధవ పనులన్నిటినీ వరుసగా ఏకరువు పెట్టాడు... పెట్టి పెట్టి ఒక్కసారిగా మావాడు దుష్టుడని, అటువంటి దుష్టులకు శిక్ష మరణదండనే అని ఎనౌన్స్ చేశాడు.
''రబ్బిష్... మీ వాడిని గురించి అతనికి ముందే తెలిసి వుంటుంది. అందుకే అలా గబగబా మాట్లాడివుంటాడు.''
''నిజమే బార్షాసాబ్... మావాడిని గురించి అతనికి ముందే తెలిసి వుండటానికి అవకాశాలు చాలా వున్నాయి. ఎందుకంటే నిజామాబాద్‌లో వాడు బాగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. కానీ ఇక్కడ ఆ విషయం ముఖ్యం కాదు. ఆ కల్కి అవతారంగాడు నా స్నేహితుడికి మరణదండన విధిస్తున్నాని అన్న రెండో గంటలో వున్నట్టుండి కళ్ళు తేలవేశాడు నా స్నేహితుడు. చెయ్యి విరగటం తప్ప మరెటువంటి అనారోగ్యమూ లేని మనిషి క్షణాలమీద గుండె ఆగి చచ్చిపోయాడు.''
''నాన్సెన్స్- నీ ఫ్రెండ్‌కి ఇంకేదో కొత్తరోగం వచ్చి వుంటుంది. ఏ ధనుర్వాతమో, గురక రోగమో తగిలి గుటుక్కుమని వుంటాడు. ఇందులో ఆ మెంటల్ మనిషి ప్రమేయం లేదు.''
