చెట్ల కొమ్మల మీద ప్రయాణంచేస్తూ షాడోను అనుసరించి వచ్చిన అటవికులు అందరూ ఒకే చెట్టుమీద సమావేశమైనారు. అరనిమిషం, ఒకటి....రెండుమూడు నిముషాలు గడిచినా షాడో బయటికి రాకపోవటం వారిలో కొందరికి విపరీతమైన ఆశ్చర్యాన్ని కలిగించింది.
"ఇంతసేపు నీటిలో వుంటే ప్రాణాలుపోతాయి. చచ్చిపోయాడంటావా?" తల బరుక్కుంటూ తన అనుమానాన్ని వెల్లడించేశాడు ఒక అటవికుడు.
లాగిపెట్టి అతని నెత్తిమీద కొట్టాడు మరొకడు.
"చవట ముఖమా! మట్లాడకుండా చూడు... ఏమాత్రం శబ్దంచేసినా మనందరి ప్రాణాలు ఎగిరిపోతాయి. మనవ రూపంలో అరణ్య సంచారానికి వచ్చాడు జీబూ. అతని ఏకాంతానికి భంగం కలిగింది. సర్వనాశనం అయ్యారు గోరీ జాతి గుంపు. సద్దుచేస్తే మనకు కూడా అటువంటి గతే పడుతుంది" అని హెచ్చరించాడు లోగొంతుకతో.
జరిగిన సంఘటనలను నెమరు వేసుకుంటున్నకొద్దీ వారిలో తమ ఎదుట ఉన్నది జీబూ అనే నమ్మకం విపరీతంగా బలపడసాగింది.
"దేవతలందరిలోను జీబూను మించిన అందగాళ్ళు మరిఎవ్వరూ లేరు. మనవ రూపం ధరించి అరణ్యంలోసంచారం చేయడం జీబూకు ఒక వేడుక" జలప్రవాహం వంకే చూస్తూ మెల్లిగా అన్నాడు వృద్ధ అటవికుడు ఒకడు.
వృద్ధ అటవికుడి మాటలువిని భయభక్తులతో తలలు ఆడించారు మిగిలినవారందరూ. "పొదల మీదినుంచి ఎగిరి గంతు వేస్తూ బయలుదేరిన జీబూను చూసి దూరంగా తప్పుకొన్నాయి ఆడవి జంతువులన్నీ, మనిషిని చూస్తే మీదపడి రక్తాన్ని రుచి చూస్తే పెద్దపులి సైతం జీబూను చూసి తోక ముడిచింది. దానిమీద నుంచి ఎగిరి అవతలకు దూకాడు జీబూ, తనను చూసి గర్జించిందని ఆగ్రహం చెందలేదు. నిజమే! జీబూకు కోపం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో చెప్పటం చాలా కష్టం!!"
కంపిస్తున్న కరచరణాలతో వూపిర్లు బిగపట్టి, జల ప్రవాహం వంకే చూస్తూ కూర్చున్నారు వారందరూ.
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.