-
-
దళిత గోవిందం
Dalita Govindam
Publisher: Bulusu Venkata Satyanarayana Murthy
Pages: 88Language: Telugu
‘‘మనందరం ఒక్కటే. సర్వమానవ సౌభ్రాత్రమే భారత ధర్మం. విశ్వమానవ శ్రేయస్సే మన భారత లక్ష్యం. సకలలోక కల్యాణమే మన భారతీయ ఆదర్శం.’’ అంటూ తనకి ఒక లక్ష్యాన్ని ప్రతిపాదించుకొని, దాని కనుగుణంగా భారత సమాజాన్ని కులభేద రహితంగా తీర్చి దిద్దే పరమోద్దేశంతో కలం చేతబట్టిన మంచి రచయిత డా॥ బి.వి.యస్.మూర్తిగారు. ఆయన లేఖినీ లత పుష్పించిన ఉత్తమ రచన ఈ ‘‘దళిత గోవిందం’’.
ఈ ‘‘దళిత గోవిందం’’లో 12 కథలు ఉన్నాయి. సాధారణంగా ఇవన్నీ అందరకూ తెలిసినవే అయినా, వీటిని మూర్తిగారు తీర్చిదిద్దిన తీరు పరమ రమణీయంగా ఉంది. భారతీయ ఆత్మను ప్రస్ఫుటం చేస్తూ, జాతిని ఏకజాతిగా సంఘటితం చేస్తూ ఆయన ఈ రచనను వెలువరించడంలో అఖిల భారత శ్రేయస్సే కాక, విశ్వ మానవ కల్యాణం కూడా నిక్షిప్తమై ఉన్నదనవచ్చు.
- డా॥ బోయి భీమన్న
* * *
ఇందులో దళితుల కథలు ఉన్నాయి. ఆ దళితులు స్త్రీలు, పురుషులు ఉన్నారు. పురాణ కాలంనుంచి నేటిదాకా ఏదో రంగంలో ప్రసిద్ధిపొందిన దళితుల గాథలు ఇందులో పొందుపరుపబడి ఉన్నాయి. పురాణ పురుషులు, చారిత్రక వ్యక్తులు, భారతదేశ స్వాతంత్య్రానంతర సాంఘిక జీవులు ఇందులో కనబడతారు. చాలమంది మత నేపధ్యంనుంచి గోచరమవుతారు. వీళ్ళు భక్తులుగా, తాపసులుగా, వేదాంతులుగా దర్శనమిస్తారు. వీళ్ళంతా అంటరాని కులాలవాళ్లు కావడమే ఈ గ్రంథ ప్రాధాన్యం. వీళ్ళు సాధారణంగా నాటి సుస్థిర వ్యవస్థను - నాడు సుస్థిరంగా వేళ్ళూని నిలబడ్డ వర్ణవ్యవస్థను ప్రశ్నించిన వాళ్ళుగా కనబడతారు. లేదంటే మీరెక్కువా కాదు, మేము తక్కువా కాదు అనయినా అన్నవాళ్ళుగా మిగులుతారు.
ఈ దళితులు జీవితాలలోని దళితత్వం ప్రధాన కారణమై వాళ్ళ పోరాటం ఉంది. పోరాటం భగవదర్చితంగా సాగినా సాంఘిక నేపధ్యం నుంచి అది పోరాటమే. వాళ్ళు విప్లవ వీరులే. వాళ్ళ జీవితం లోకానికి అందివ్వటం రచయిత అభీష్టం. ఈ దళితుల జీవితం చక్కగా రూపు దిద్దుకుంది. భాష బాగుంది. రచనా విధానం బాగుంది. పలుకున్న మనిషి పలుకుబడికి ప్రాణం పోయటం పరిశీలనార్హం.
- ఆచార్య కొలకలూరి ఇనాక్
