"నువ్వు చెప్పదలచుకున్నది నిర్భయంగా చెప్పు... నీకు ఎటువంటి ఇబ్బంది కలుగదు'' అలవాటు ప్రకారం పోలీస్ పద్ధతిలో భరోసా ఇచ్చాడు సబ్ఇన్స్పెక్టర్ భార్గవ.
''హార్బర్ దగ్గిర గోడవున్స్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ వుంటాను నేను. చీకటిపడిన తరువాత ఆ ఏరియాలో తిరిగే రౌడీల్ని, కిలాడీల్ని ఎంతోమందిని చూస్తూ వుంటాను. నాలుగురోజుల క్రితం నాకు తెలిసిన ఒక విషయాన్ని మీకు చెపితే, ఎంతగానో వుపయోగిస్తుందని అనుకుంటున్నాను'' అంటూ మరింతగా గొంతు తగ్గించాడు రషీద్‌మియా దోస్త్.
''నాలుగు నెలల క్రితం ఔరంగాబాద్‌లో నివసించే సేట్ చవ్వన్ లాల్ దివాణంలో బ్రహ్మాండమైన దోపిడీ ఒకటి జరిగిందట నిజమేనా?'' అతనికి మాత్రమే వినిపించేటట్లు అడిగాడు.
కుతూహలంగా చూస్తూ తలవూపాడు భార్గవ.
''ఎవరికీ కనిపించకుండ అంతర్థానం అయిపోయిన ఆ దొంగల్లో ఒకతను, కాలియా అని పిలవబడే వ్యక్తి మన సిటీ బయట వుండే బాజు ఏరియాలోని సారా దుకాణం దగ్గిర తచ్చట్లాడుతున్నట్లు, క్రమం తప్పకుండా అక్కడికి వచ్చి సారా పుచ్చుకుంటున్నట్లు ఇద్దరు కేడీలు చెప్పుకోవడం నా చెవులపడింది.''
తనకు తెలిసిన విషయాన్ని తడుముకోకుండా చెప్పి అతని ముఖం లోకి చూశాడు రషీద్‌మియా దోస్త్.
ఉబికి వస్తున్న ఎగ్జయిట్‌మెంట్‌ని విల్పవర్నంతా కూడగట్టుకొని అదుముకుంటూ తలూపాడు భార్గవ.
