-
-
సినిమా ఒక ఆల్కెమీ
Cinema Oka Alchemy
Author: Venkat Siddareddy
Publisher: Perspectives
Pages: 272Language: Telugu
అత్యంత ఆధునిక కళాప్రక్రియగా రూపొందిన సినిమా తన సంస్కరణవాద, గ్రామీణ మూలాల నుంచి వేరుపడి ఇవాళ అది పూర్తి వ్యాపారాత్మకమైంది. నాటకరంగం విషాదంగా నిష్క్రమిస్తున్న వేళ, సినిమా వేయిపడగలు విప్పి హోరెత్తుత్తోంది. ఆధునిక వ్యాపారవేత్తలు, మాఫియా - కళాపోషకులుగా తల ఎత్తాక... ఈ రంగం నుంచి ఇంకా ఏమైనా ఆశించగలమా? హరిపురుషోత్తమ రావు అన్నట్లు "యథాపాలకవర్గం, తథాసాంస్కృతిక రంగం."
ఈ ప్రధాన స్రవంతికి భిన్నంగా ప్రపంచంలో ప్రత్యామ్నాయ సినిమా కొత్త ఆశలతో చిగురిస్తోంది. మానవీయకోణం నుంచి సామాజిక ఆవరణంలోకి సాగిన భిన్న ప్రదేశాల, భిన్న ఇతివృత్తాల ఆశావహ చిత్రాల సమాహారమే వెంకట్ శిద్దారెడ్డి వెలువరించిన దృశ్యమాలిక ‘సినిమా ఒక ఆల్కమీ.’
ఒక్క ఫ్రేములో ప్రపంచాన్ని చూపించే దర్శకుల నుంచి, ఆ దర్శకుడి సృజనాత్మకతలోని 'కీలక సన్నివేశం’ ని చదవటం తెలుగు పాఠకులకి ఒక కొత్త అనుభవం. సినిమాని ఎలా తీశారో, మనం ఎలా చూడాలో కూడా విజువల్ పోయెట్రీలా సాగిన ఈ పుస్తకం వివరిస్తుంది. ఒక భయ విస్మయ ఆనంద హేలనుంచి హృదయవిదారక వర్తమాన వాస్తవంలోకి పాఠకుడిని ఒక నూతన అనుభవానికి గురిచేస్తుంది ఈ ‘సినిమా ఒక ఆల్కెమీ'. అందమైన జీవితం అంటే అన్నీ ఉండటమే కాదు; ఏది అవనరం లేదో తెలుసుకునే స్పృహని మనం పొందుతాం.
ఈ పుస్తకంతో సినిమారంగం గురించిన ప్రచురణలలో మా తొలి అడుగు పడింది. అది ‘సినిమా ఒక ఆల్కెమీ’ కావడం మాకు కొత్త అనుభవమే.
- ఆర్ కె
పర్స్పెక్టివ్స్
