• Chitralekha Navala - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • చిత్రలేఖ - నవల (free)

    Chitralekha Navala - free

    Pages: 87
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"శ్వేతాంకా!"

"స్వామీ!"

"నీవీరోజేం చూచావో తెలుపుతావా?"

"ఓ! ఈ రోజు స్వామిని కుమారగిరిని పరాజితుణ్ణి చేసింది. నాకెంత సంతోషమైందో!"

"నీకు సంతోషమైందా!" - కటువుగా నవ్వినాడు బీజగుప్తుడు. "నీకు సంతోషమైందేమొ కాని శ్వేతాంకా, నాకు మాత్రం దుఃఖం కలిగింది. నా యీమాటలపట్ల నీకాశ్చర్యం కలుగవచ్చు. కాని యిది నిజం. నీకు హర్షం కలుగవచ్చు, నాకూ కలిగితే కలుగవచ్చు. కాని నా ఆత్మ మాత్రం రోదిస్తున్నది."

శ్వేతాంకుడాశ్చర్యంతో అడిగినాడు - "దేవరవారి తాత్పర్యం నాకర్థం కావడం లేదు."

"అర్థం కాలేదా? ఔనులే, నీకెట్లా ఔతుంది? నీవింకా సంసార వైఖరి నెఱుగవు, నీ వనుభవశూన్యుడవు. నీవు దేన్ని చిత్రలేఖా విజయంగా భావిస్తున్నావో అది ఆమెకు గొప్ప పరాజయం, చిత్రలేఖా, కుమారగిరీ వీరెవ్వరూ విజయులు కారు, ఇద్దలూ పరాజితులే! ఝటితిగా పరిభ్రమించే పరిస్థితుల చక్రంలో వారిద్దఱూ చిక్కుకొనిపోయారు."

బీజగుప్తుని మాటలు శ్వేతాంకుని కింకా బోధపడలేదు. అప్పటికి రథం బీజగుప్తుని ప్రాసాదద్వారాన్ని చేరుకున్నది. ఇద్దఱూ రథాన్ని దిగారు. బీజగుప్తుడు శ్వేతాంకుని హస్తాన్ని గ్రహించి అన్నాడు - "నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. రా! కాస్సేపు నాతో వచ్చి కూర్చో."

శ్వేతాంకునికి నిజంగా బీజగుప్తుని మాటలలోని ఆంతర్యం అర్థం కాలేదు. స్వామి, సేవకుడు - ఇద్దఱూ అధ్యయనభవనంలోనికి వెళ్లారు. శ్వేతాంకుని కూర్చొనమని ఆదేశిస్తూ బీజగుప్తుడు గూడ ఆసీనుడై అన్నాడు - "శ్వేతాంకా! నీవెఱుగుదువా కుమారగిరి కెందుకు పరాజయమైందో?"

"లేదు."

"దీని రహస్యం నేను చెప్తాను విను. చిత్రలేఖను నే నెఱగినంతగా నీవెఱుగవు. ఆమె వ్యక్తిత్వ మున్నతమైనది, ప్రభావవంతమైనది కూడ. కుమారగిరి విద్వాంసుడు, యోగీశ్వరుడు కూడ; వాసనాపరంపరల యెడ నాతనికి వైముఖ్యమున్నది. చిత్రలేఖకు వైదుష్యమున్నను సాధనయెడ వైరుధ్యమున్నది. వారిర్వురికీ అహంభావపూరితమైన మమత్వమున్నది, ఆ మమత్వపరిపూర్తిపై విశ్వాసమున్నది. కాని వారది సాధింపనెంచిన మార్గాలు వేఱుగాను, విపరీతంగాను ఉన్నవి. యోగి సాధన నాశ్రయిస్తే, నర్తకి ఆత్మవిశ్వాసాన్ని ఆశ్రయించింది. కాని నేడు జరిగినదాన్ని బట్టి చూస్తే వారిర్వురూ తమతమ మార్గాలయందు విరక్తులైనారు. త్వరలోనే వారు తమ శక్తులను కోల్పోగలరు."

బీజగుపుని మాటలు శ్వేతాంకునికొక ప్రహేళిక (Puzzle) వలె భాసించినవి. అతడన్నాడు - "స్వామీ! మీ విచారధారలోని అంతర్యాన్ని నేనందుకొనలేక పోతున్నాను.”

బీజగుప్తుని స్వనం మందగించింది. అతడన్నాడు - "ఈ మాటల నింకా స్పష్టం చేయడానికి నాకు ఓపికా లేదు, అట్లా చేయడం ఉచితమనీ నేననుకోను. తెలియగోరితే నేను సూచించిన మార్గంలో నీవు ప్రవర్తించు."

శ్వేతాంకుడన్నాడు - "స్వామివారి ఆజ్ఞాపరిపూర్తికి ....."

"ఈ రోజు నీవు చిత్రలేఖ నభినందించుటకు వెళ్లి ఆమె ముఖగతభావాలను పరిశీలించు."

శ్వేతాంకు డప్పుడే చిత్రలేఖాభవనానికి వెళ్లాడు. చిత్రలేఖాభవనద్వారం ఆమె నభినందించుటకు వచ్చిన యువకసామంతరాజుల సమూహంచేత సంవలయితమై ఉన్నది. అమె దాసీలు వారల కతిథిసత్కారం చేస్తున్నారు. కాని చిత్రలేఖమాత్ర మక్కడ లేదు. శ్వేతాంకుడొక దాసి నడిగినాడు - "స్వామిని యెక్కడ?" - దాసి అతణి లోనికి దీసుక వెళ్లి ఒక సుసజ్జితమైన గదిలో కూర్చుండబెట్టి అన్నది - "స్వామిని యింకా రాలేదు. వస్తూనే ఉన్నదనుకుంటా!" - శ్వేతాంకు డామెకై నిరీక్షింపసాగినాడు.