-
-
చిత్రగ్రంథి
Chitra Granthi
Author: Sudhama
Publisher: Self Published on Kinige
Pages: 151Language: Telugu
సుధామగా సాహిత్య లోకంలో పేరు పొందిన అల్లంరాజు వెంకటరావుగారి కవితా సంపుటి ఇది. నాటి 'అగ్ని సుధ' నుండి నేటి 'చిత్ర గ్రంథి' దాకా వీరి సాహిత్య కవితా స్వరూపం ఎంతో ఎత్తుకు ఎదిగింది. వీరి లేఖిని నుండి కవితా సేద్యంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి కవితలు వెలువడ్డాయి. ఈ కవితా సంపుటిలో 61 కవితలున్నాయి. కవి, రచయిత, సమీక్షకుడు, కార్టూనిస్టు, కాలమిస్టు, పజిల్ నిర్మాత, వక్త, విశ్రాంత ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణాధికారిగా, తెలుగు సాహిత్యలోకానికి సుధామ చిరపరిచితులు. కవిత్వం ఇష్టపడే స్నేహితులకు ప్రేమగా ఈ 'చిత్రగ్రంథి'ని అంకితం చేశారు కవి. ఈ పుస్తకానికి టైటిల్ పెట్టిన 'చిత్రగంథ్రి' కవితలో ఒక చోట కవి ఇలా అంటారు
"వెయ్యేళ్ల క్రితం జంతువుల ఆట
జురాసిక్ పార్క్ ఎందుకు?
నేటి స్వేచ్ఛాక్రూర మృగంగా తరాన్ని
వెంటాడి వేటాడి
తీర్చిదిద్దే ఆస్కారం ఉన్న
ఏ సిన్మా అయినా
ఆస్కార్ కన్నా
బలవత్తరమైంది'' అంటారు (పేజీ31). వస్తువును కవితామయం చేయడం సుధామ సొంతం. 'చమురు గుండె సెగ' కవితలో కవి ఎంతో ఆర్థత కలిగించే వాక్యాలు రాశారు. అవి (పేజీ18) ఇరాక్ ఇరుకుల్లోకి పరుగిడి చొరబడినప్పుడు
ఇథియోపియా ఘోర దుర్భిక్షాన్ని మించిన మహా విషాదం
జోర్డాన్ తీరాన
నేడివాళ అంతమేలేని
పీడ కలలా చుట్టుముట్టి
తమ జీవసారాన్నే
చమురు బొట్టులా పిండుతుందని
క్షణమైనా తలపోశారా? అంటారు కవి. 'నరా'వతారం కవితలో (పేజీ97). ''మెదడులో భూగోళమంత వైశాల్యం
హృదయంలో సముద్రమంత అగాధం
బుద్ధిలో ఆకాశమంత సమున్నతం
పొలంలో నాగేటిచాలు
కర్మాగారంలో శ్రామికుడి విన్నాణపు శ్రమవాలు - నరం
అవును - నరం''. అలాగే ఈజిప్టు కైరోలో ఈనాటికీ సాగుతున్న క్లిటోరిస్ తొలగింపు కిరాతక చట్టంపై 1999లో కవి రాసిన ఓ మంచి కవిత... ''కొత్త పువ్వులు శ్వాసిస్తాయి'' అనే కవిత, అన్యభాషల్లోకి, అన్య దేశాల్లోకి అనువదించాల్సిన గొప్ప కవిత... నేడు ఖండితమౌతున్న గుహాంతరాళాల బొడిపెలే
అణువులై విస్ఫోటించి
ప్రళయాగ్ని కీలలవుతాయి
పాటగత్తె కాదు
వేట కత్తి నీకు గురి
విషపు తేనెటీగవు నువ్వు
రేపటి ప్రపంచం తోటలో
నిన్ను నియంత్రించి శాసించే
కొత్త పువ్వులు శ్వాసిస్తాయి
ఇక తప్పదు... (పేజీ69). కృత్యాదిగా (పేజీ62) మొహం మొత్తం గుండా కవి
మనిషిగా నిలబడ్డాడు
సహృదయ పాఠక హృదయంపై
ప్రేమతో కలబడ్డాడు అంటారు కవి. ఇలాంటి అద్భుతమైన భావశబలత, అభివ్యక్తి సాంద్రత గలవి వీరి కవితలు.
--తంగిరాల చక్రవర్తి
