-
-
చిలక చెప్పిన రహస్యం
Chilaka Cheppina Rahasyam
Author: Nanduri Ramamohana Rao
Publisher: Victory Publishers
Pages: 98Language: Telugu
సిద్ధుడు కథ ఇలా అడ్డం తిరుగుతుందని ఊహించలేదు. అందుచేత తెల్లబోయాడు. కొంతసేపు ఎలా పడిన వాడలాగేఉండి దేవదత్తుణ్ణి చూశాడు. తరువాత నెమ్మదిగా జరిగి తన దండం తీసి దేవదత్తునితో తలపడ్డాడు. కాని క్షణంలో దేవదత్తుడు దాన్ని తుత్తునియలు చేశాడు. అయినా సిద్ధుడు పట్టు విడవక దేవదత్తుని పైకి లంఫిుంచాడు. ఇక చేసేది లేక దేవదత్తుడు కాలకీలను సిద్ధుని పొట్టలో పొడిచాడు. ''కాళీ'' అని భయంకరంగా ఆలయమంతా మారుమ్రోగేట్లు అరిచి సిద్ధుడు నేలకూలాడు.
''పాపాత్ముడా! నీవు చేసిన మోసానికి శాస్తి ఇదే. అనుభవించు'' అని దేవదత్తుడు అరిచాడు.
కొన ఊపిరితో ఉన్న సిద్ధుడు గిలగిల తన్నుకుంటూ ''దేవదత్తా? క్షమించు, నిన్ను మోసం చెయ్యాలని తలపెట్టిన మాట నిజమే. నిన్ను కాళికాదేవికి బలి ఇచ్చి నేను వరాలు పొందాలని అనుకున్న మాటనిజమే. కాని నేను నీ జన్మ రహస్యం గూర్చి చెప్పింది, సింహగిరి మీద రాక్షసుడి దగ్గరున్న చిలకను గూర్చి చెప్పింది అంతా అబద్ధం కాదు. ఆ చిలక ఒకప్పుడు నా దగ్గర ఉండేది, దాని ద్వారా నీ సంగతి, నీ జన్మ రహస్యం సంగతి విన్నాను. నిన్ను కాళికాదేవికి బలి ఇస్తే నాకు అణిమాది అష్టసిద్ధులు లభిస్తాయని ఆ చిలకే చెప్పింది. నేనొకసారి సింహగిరి ప్రాంతంలో సంచరిస్తుండగా ఆ రాక్షసుడు నన్ను మాయచేసి ఆ చిలకను దొంగిలించాడు.
నేనెలాగో తప్పించుకున్నాను. ఆ చిలక ఇప్పటికీ వాడి దగ్గరనే ఉంది అది ఎవరేది అడిగినా చెబుతుంది.తను ఎవరి దగ్గరుంటే వారి మాట వింటుంది. వారికి సహాయం చేస్తుంది. అందుకే నేను అణిమాది సిద్ధులెలా లభిస్తాయని అడిగినప్పుడు అది నీ సంగతి చెప్పింది. అంతేగాని నీ మీద దానికి ద్వేషం ఉందని అనుకోబోకు అది చిత్రమైన చిలక. రాగద్వేషాలేవీ అంటని స్థితప్రజ్ఞుడిలా ఉంటుంది. పాపం ఏదో శాపం వల్ల చిలక జన్మ ఎత్తిన ఏ ఋషీశ్వరుడో ననుకుంటాను. దేవదత్తా! నాకు కాలం ఆసన్నమైంది. నన్ను క్షమించు. కాళీమాతా!'' అని మూలుగుతూ సిద్ధుడు ప్రాణాలు విడిచాడు.
