-
-
చెట్టంత మనిషి
Chettantha Manishi
Author: Dwibhashyam Rajeswara Rao
Publisher: Paryavarana Prachuranalu
Pages: 228Language: Telugu
ద్విభాష్యం రాజేశ్వరరావుగారి కథలలో మొదటి గొప్పలక్షణం - ఆసక్తితో ఆద్యంతమూ చదివించడం. రచయిత అనవసరమైన పద ఆడంబరానికి పోడు. పాండిత్యాన్ని వొలకపోయరు.
రెండోది వస్తువు. ద్విభాష్యం రాజేశ్వరరావు ‘‘మధ్యతరగతి’’ రచయిత. ఆయన కథల్లో మెర్సిడిస్ కారులూ, అందమయిన సినీతారలూ, ఖరీదయిన జీవితాలు గడిపే కార్పొరేట్ ఆఫీసర్లు, విమానాలూ ఉండవు. రైల్వేటీసీలూ, బ్యాంకు గుమస్తాలూ, లారీ డ్రైవరు పెళ్లాలూ, గవర్నమెంటు బంట్రోతులూ ఉంటారు. ఆయన కథల్లో వ్యభిచారులూ, హత్యలూ, రంకులూ, విప్లవాలూ, తిరుగుబాటులూ, జీవితాదర్శాలు, ఇజాలూ, బడుగు జీవితాల ఆక్రోశాలూ ఉండవు. అతి సాదాసీదా జీవితాలు, నిరాడంబరంగా జీవించే పాత్రలూ ఉంటాయి. లక్కీలూ, డుంబూలూ, రాఖీలూ, రమోలాలూ ఉండరు. తులసమ్మ, సుజాత, సీత, సుమతి, బాబూరావులుంటారు. ఆయన నీతిని బోధించడు. ఆదర్శాల్ని వల్లించడు. పాఠకుల్ని హెచ్చరించడు. పిడికిళ్లు బిగించడు. ఎవర్నీ రెచ్చగొట్టడు. మీతో హాయిగా నడుస్తూ, మీ జీవితాల్ని మెల్లగా విప్పుతూ మీరు గుర్తు పట్టని మెలికల్ని మీకు అందేలా, ‘‘ఆహా!’’ అనిపించేలాగ చెప్తాడు. నమ్మకమయిన ముగింపుతో పక్కకి తప్పుకుంటాడు. ఆయన బూతుకథలు రాయడు. నీతికథలు చెప్పడు.
ఆయన కథలు మనల్ని విడవకుండా చదివించడానికి, ఆయన ఒడిసి పట్టుకున్న మరో గొప్ప శిల్పం ఉంది. అది చాలా మంది రచయితలు గమనించని గొప్ప లక్షణం. ప్రతీ కథనీ ఒక మెలికతో, ఒక ముడితో, ఒక ఉత్సుకతతో, ఒక మెరుపుతో ప్రారంభిస్తాడు. ‘ఇక చదవకపోతే ఎలాగ?’ అనిపిస్తాడు. కథ take off ఏ విధంగా పాఠకుడి ఆసక్తిని వొడిసి పట్టుకుంటుందో తెలిసిన మాంత్రికుడు ద్విభాష్యం.
అతని కథల్లో మరో ఆరోగ్యకరమైన రుచి -చక్కని వ్యంగ్యంతో కూడిన హాస్యం. మనకు విసుగుపుట్టి, కసి పెరిగిన అవినీతి పట్ల మనకు మనసునిండా కోపం ఉంట-దాన్ని హాస్యంగా తర్జుమా చెయ్యగల చక్కని మనస్తత్వ శాస్త్రజ్ఞుడు, రచయిత. ఈ తర్జుమా అవసరం ఏమిటి? మన చుట్టూ ఉన్న అవినీతి మనలో నిస్త్రాణనీ, కోపాన్నీ, నిస్పృహనీ పెంచితే; రచయిత ఆ గాయానికి మలామాచేసి sense of humour ని నేర్పుతాడు. మంచికి వేళ మించిపోలేదని మనలో sanity ని నిలుపుతాడు. ఈ సమాజాన్ని ఉద్ధరించాలని కంకణం కట్టుకున్న చాలామంది రచయితల కంటే ఇదే ‘ఒక రచన చెయ్యగల మంచిపని’ అని నేను నమ్ముతాను.
ద్విభాష్యం రాజేశ్వరరావుగారు చక్కగా మధ్య తరగతి కుటుంబంలో బాసింపట్టు వేసుక్కూచుని హాయిగా, సుఖంగా కథలు చెప్పే ఒడుపు తెలిసిన కథకుడు. ఆయన మీ భుజం మీద చెయ్యివేసి కథల కావిళ్లతో మీతో నడుస్తారు. ముందుకు పదండి, మరి....
- గొల్లపూడి మారుతీరావు
