-
-
చెన్నై చిన్నది
Chennai Chinnadi
Author: Sombhatla Subrahmanya Sastry
Publisher: Self Published on Kinige
Pages: 141Language: Telugu
“ఏమిట్రా కనకా,కనకా అంటూ ఆ పిలుపు?’శునకా’ అన్నట్టు వినబడుతోంది.నా పేరు కనకదుర్గా ప్రియదర్శిని-రాసి పెట్టుకో!నూటొక్క సార్లు చెప్పినా కూడా వినక, కనకా కనకా అనడం మానక పోయేవనుకో,నేను ఉలకను, పలకను!పూనకమొచ్చిన కనకదుర్గాంబలా నీ పేగులు తోడక మానను,తెల్సుకో.ఆనక మరేదారీ కానక, ఏమి చేయనూ తోచక,పశ్చాత్తాపంతో కుమిలిపోతూ,కకావికలైన మనసుతో,తికమకలు పడుతూ,కోపం వదులుకోమని నన్ను కన్విన్స్ చేదామనే కొండంత కోరికతో,చిన్నాచితకా కాని కాస్ట్లీ కానుకల్తో నా వెనకవెనక తిరిగినా కూడా నా అలక తీర్చడం నీ వల్ల కాదని మా హంబుల్ వార్ణింగ్!! నీక్కనక ఈ కనకదుర్గా ప్రియదర్శినిని ప్రసన్నం చేసుకునే కోరికుంటే, బీ కేర్ఫుల్ !! ఫో! నీ జట్టు ఇక కా!"
ఇలా అన్నగార్ని హెచ్చరించి,జానకికేసి తిరిగి అంది దుర్గ.- "నేను మాట్లాడ్డం మానేసేనంటే అన్నయ్యకి మతే పోతుందనుకో!మా భలే డోస్ ఇచ్చేను కదూ!ఏదో ఓ నాడు ఇలాటి అవసరం వస్తుందని నాకు తెల్సు. అందుకే స్క్రిప్ట్ రాసి రడీగా పెట్టుకున్నాలే ముందుగానే. ద్విత్వాలతో కలిపి లెక్కెడితే మొత్తం అరవైయొఖ్ఖ 'క' లు ఉంటాయ్!ఎలాఉంది?"అనిదుర్గ అడుగుతుంటే, రియల్లీ సుపర్బ్!"అంది జానకి మనస్ఫూర్తిగానే.
“నువ్వేనాడు జడేసుకున్నావే?ఎప్పుడూ అమ్మవారిలాగా జుట్టంతా విరబోసుకునే ఉంటావ్ కద!ఇక పూనకమొస్తే చూడగలమా!"
“.అది సరే, ఇంతకీ పేరేమిటన్నావూ?"దుర్గ అడుగుతోంది ఇటు తిరిగి.
"నేనా? నేనేమీ అననే లేదే!”
“అబ్బో, నువ్వూ బాగా జోకులేస్తావన్నమాట! ఫరవాలేదు,మాలో కలుస్తావ్!ఇప్పుడడుగుతున్నా, పేరేమిటి?"
"జానకి"-ముక్తసరిగా చెప్పింది.
"నేనడిగింది మా అన్నయ్య పేరు కాదు. నీ పేరు"
"మీ అన్నగారి పేరు నువ్వెందుకడుగుతావ్, నేనెందుకు చెప్తాను!!నా పేరే జానకి."”
"బాగు బాగు. నీ పేరూ జానకేనా?మరీ, ఉత్థ జానకా?"
"ఉత్థ జానకి కాదు,జానకి-జా..న .కి.నా పేరు జానకి.మై నేమీజ్ జాన్ఖీ .మేరా నాం జాన కీ హై.ఎన్ పెయర్ జానహి.కన్నడం,మళయాళం డోంట్ నో.
"హమ్మో, మాదొడ్డ మాటకారే చిన్నొదిన" అని దుర్గ అనగానే ఉలిక్కిపడింది.ఈ వెంపంతా ఇట్టే వరసలు కలిపేస్తారే!.. చిన్నవదినట!!
"వరసలొద్దు.నువ్వు నన్ను జానకీ అను- చాలు.నేను దుర్గా అని పిలుస్తూంటాను.సరేనా?"అంటూ ఒప్పందం కుదుర్చుకోబోయింది.
"సరే చిన్నొదినా"అంటోంది ఆ పిల్ల నవ్వుతూ.ఇంకేమనేది? శుధ్ధ కొంటె కోణంగి! ! !
