-
-
చండాలుడు
Chandaludu
Author: Karanam Balasubramanyam Pille
Publisher: Karanam Balasubramanyam Pille
Pages: 176Language: Telugu
ఇది త్రిశంకు మహారాజు కథ.
త్రిశంకుమహారాజు ''ఎంత గొప్ప యజ్ఞమైనా చేసి నన్ను బొందితో స్వర్గానికి పంపండి'' అని వసిష్ఠుడిని అడుగుతాడు. వసిష్టుడు ''అది సాధ్యంకాదు'' అంటాడు. త్రిశంకుడు వసిష్ఠపుత్రుల దగ్గరికి వెళ్ళి ఇదే కోరిక కోరుతాడు. వాళ్ళు ''మా తండ్రి కాదన్న పనిని మేము చేస్తామా. అది సాధ్యం కాదు'' అంటారు. ''అయితే మరే ఋషినైనా ఆశ్రయించి నా కోరిక నెరవేర్చుకుంటాను'' అంటాడు త్రిశంకుడు. వెంటనే వసిష్ఠపుత్రులు కోపించి ''నీవు చండాలుడవై పోదువు గాక'' అని శపిస్తారు. రాత్రికి రాత్రే త్రిశంకుడు చండాలుడైపోతాడు- తరువాత విశ్వామిత్రుడు ఒక యజ్ఞం చేసి త్రిశంకుడిని బొందితో స్వర్గానికి పంపుతాడు. అక్కడ ఇంద్రుడు చండాలుడికి స్వర్గప్రవేశం లేదని త్రిశంకుడిని త్రోసివేస్తాడు. విశ్వామిత్రుడు త్రిశంకుడిని అంతర్మధ్యంలోనే నిలిపి అక్కడే ఒక స్వర్గం నిర్మిస్తాడు.
ఈ కథ ఇంతే అయితే దీనిని ప్రత్యేకంగా ఒక నవలగా వ్రాయవలసిన పనిలేదు.
ఇక్ష్యాకు వంశపు రాజు ఇంత తెలివితక్కువ కోరిక కోరేవాడా?
అంత మాత్రానికే వసిష్ఠపుత్రులు అంత ఘోరశాపం పెట్టారా?
విశ్వామిత్రుడు ఒకానొక రాజు కోసం రెండవ స్వర్గాన్ని నిర్మిస్తాడా?
కాదు. అక్కడ ఏదో జరిగింది.
ఏమైనా జరిగి ఉండనీగాక ఫలితం మట్టుకు ఘోరమైనది. కనుక ఇది కేవలం ఒక త్రిశంకు మహారాజు కథ కాదు.
ఇది ఒక్కగా నొక్క వ్యక్తి- ఒకఋషి- ఇచ్చిన శాపానికి ఒక మహారాజు తన రాజ్యానికీ, తన ప్రజలకూ, తన పరివారానికీ, చివరకు తన భార్యా బిడ్డలకూ దూరమై, దయనీయమైన స్థితికి చేరిన భయంకరమైన గాథ.
ఎప్పుడో, ఎక్కడో, ఎవరో ఒకసారి చేసిన తప్పుకు ఆ తప్పుచేసిన వాడూ, వాడి వంశమూ తరతరాలకూ చండాలత్వ శిక్షకు గురి అయ్యే భయంకరగాథ. వర్ణవ్యవస్థ, వర్గ వ్యవస్థ కలిసి వైశాచిక నృత్యం సలిపి అభాగ్యులను పీడించిన భయంకరగాథ.
అన్నిరకాల అభాగ్యులనూ, అన్ని రకాల అనాథలనూ, అన్నిరకాల బహిష్కృతులనూ తన అక్కున చేర్చుకొని ఆదరించిన పంచమవ్యవస్థ యొక్క ఉదాత్త గాథ. చతుర్వర్ణాలతో- కాలక్రమేణ అనేక ఉపవర్ణాల విభజనతో- లుకలుక లాడుతున్న అగ్రవర్ణ సమాజాన్ని దూరం నుండి చూస్తూ నవ్వుకుంటున్న ఏక వర్ణ, పంచమ వ్యవస్థ యొక్క సమైక్యతాగాథ.
అందువల్లనే దీనిని ప్రత్యేకంగా ఒక నవలగా వ్రాయవలసి వచ్చింది. ఇందలి సన్నివేశాలూ, పాత్రలూ, అన్నీ కల్పితాలే.
- రచయిత
