“రాజూ.... యీ రాత్రికి! మనం బయటికి పోదాం ….” అన్నది మెల్లిగా. ఆ మాటలకు అర్ధం తెలిసి చిన్నగా నవ్వాడు షాడో. అతని ముఖంలో ప్రతిబింబిస్తున్న కరుకుతనం మాయం అయిపోయింది.
"కెటీనా.... నువ్వు ఎందుకిలా అన్నావో నాకు తెలుసు. నా ప్రవర్తనలో ఏదో మార్పు వస్తున్నది అని అనుమాన పడ్డావు. నథింగ్ బేబి! క్రొత్త మార్పులు ఏవీ రాలేదు. ఆ పాకెట్ కోసం ఇక్కడికి వచ్చాను. దాన్ని క్షేమంగా నా దేశం చేరిస్తే గాని నాకు విశ్రాంతి లేదు. అందుకు ఎన్ని కిరాతకాలైనా చేస్తాను. ఒక వేళ అది మనకు దొరకకుండా మిగిలిన వారికి చిక్కితే - వారినందర్నీ హతమార్చి దాన్ని తిరిగి దక్కించుకుంటాను.”
“నాకు పాపం, పుణ్యం అనే విచక్షణ అవసరం లేదు. నాకు దైవం నా కర్తవ్యమే, కర్తవ్య నిర్వహణ కోసం ఎన్ని పాపాలైనా చేస్తాను. నీతో శారీరక సుఖాల్ని పొందటం వల్ల - నా శరీరం విశ్రాంతి పొందుతుంది కాని, నా మనస్సు కాదు.”
షాడో మాటలు కెటీనాని మూగదాన్ని చేశాయి. అతనిలో దాగి వున్న అసలు వ్యక్తి - 'కిల్లింగ్ మాస్టర్ షాడో ' ఆ క్షణంలో ఆమెకు కనిపించాడు.
"రాజూ.... అందరూ నీ పేరు వింటే.... భయపడటానికి కారణం నాకు ఇప్పుడు అర్ధం అయింది ” అంటూ చూపులు పక్కకు తిప్పుకున్నది.
