-
-
కేర్‌టేకర్
Caretaker
Author: C. Umadevi
Publisher: J.V.Publications
Pages: 120Language: Telugu
''సత్యం, ప్లీజ్ మూడ్ మార్చుకోరా, ఇక నువ్వు శర్మగారి దగ్గరకు పరీక్షలయే దాకా వెళ్లకులే. అయినా ఆయన చెప్పిందాంట్లో మాత్రం తప్పేముంది? పరీక్షలు దగ్గరపడ్డాయి, కాస్త ఫ్రెండ్స్ చుట్టూ తిరగడం మానేసి బుద్ధిగా చదువుకోమన్నాడు. అంతేగా?''
'అంతేగా' అంటున్న రాజేంద్ర వంక గుర్రుగా చూశాడు సత్యం.
''నీకు అంతేగా, మరి కాసేపక్కడే ఉంటే నేనే అంతమయేవాడిని. నీతో మిత్రలాభమట, మిగతా ఫ్రెండ్సంతా మిత్రభేదమట. మధ్యలో సబ్జెక్ట్ తెచ్చి ఇరికిస్తాడు. ఓహ్! ఏం వాక్ప్రవాహం తండ్రీ! సముద్రం దగ్గర ఉప్పు అమ్మాలంటాడు. ఎడారిలో ఇసుక అమ్మాలంటాడు. అదే ఇసుకను సముద్రపు ఒడ్డునే బహు చక్కగా అమ్మొచ్చంటాడు. విని వినీ నా చెవుల్లో ఇసుక పోసినట్టు గురగురలాడిపోతున్నాయి. నన్నెందుకింతలా బాదాడు దేవుడా?'' సత్యం గోడకు చేరగిలబడి కూర్చుండిపోయాడు.
''ఎందుకా? నువ్వు మార్కెటింగ్ విద్యార్థివి. మార్కెటింగ్‌లో ఎలా గెలవాలో శర్మగారు చెప్పారు. ఎలాంటి వస్తువునైనా మనం మార్కెటింగ్ చేయగల నైపుణ్యాన్ని సంపాదించుకోవాలి. తెలివితేటలుంటే సముద్రపు ఒడ్డున ఉప్పే కాదు ఇసుక కూడ అమ్మగలం. ఎలా అని అడగకు అదీ చెప్తాను. 'తాయెత్తులలో మంత్రించిన ఇసుక అనారోగ్యాన్ని దూరం చేస్తుంది. అదృష్టాన్ని లాక్కువస్తుంది' అని చెప్పి చూడు, సముద్రపు ఒడ్డే మార్కెట్ యార్డ్ అవుతుంది.''
''ఆ...'' నోరు తెరిచాడు సత్యం.
''బాస్! నీ మార్కెటింగ్ తెలివితేటలు రేపు నీవు చేరబోయే ఉద్యోగంలో చూపించు. నన్ను మాత్రం వదిలెయ్యండి ప్రభూ!'' సత్యం రాజేంద్రవైపు తిరిగి రెండు చేతులు జోడించాడు.
''సరే వదిలేశాం, కనీసం పాకకళలోనన్నా నీ నైపుణ్యం చూపుదువుగాని రా.'' రాజేంద్ర టాపిక్ మార్చాడు. ''ఉప్మా ఉపాహారం శర్మగారి మాటలకెప్పుడో ఆవిరయిపోయిందిలే!'' అంటూ సత్యం రాజేంద్రను చూసి నవ్వాడు. ఆపైన స్నేహితులిద్దరూ వంట ప్రయత్నంలో పడ్డారు.
