-
-
కాలిఫోర్నియా హిట్
California Hit
Author: N S Nagireddy
Pages: 106Language: Telugu
ఠక్కున కళ్ళు తెరిచాడు కిల్లర్. డిమ్‌గా వెలుగుతున్న బెడ్‌లైట్ కాంతిలో అతను కాలిఫోర్నియాలో బసచేసిన హోటల్ రూం అస్పష్టంగా కన్పిస్తోంది. డెత్మర్చంట్ను చంపిన వెంటనే హోటల్‌కి వచ్చి రూం తీసుకుని నిద్రపోయాడు కిల్లర్.
మరుసటిరోజు ఉదయం పారిస్ వెళ్ళేందుకు నిశ్చయించుకున్న తనకు హఠాత్తుగా ఎందుకు మెలకువ వచ్చిందో క్షణం కిల్లర్‌కి అర్థంకాలేదు. ఎంత నిద్రలోవున్నా ప్రమాదం దరిదాపులలో వున్నప్పుడు ఆటోమాటిక్‌గా మెలకువ వచ్చేస్తుంది కిల్లర్‌కి.
తను విన్నదేమిటో గుర్తుచేసుకోవటానికి ప్రయత్నిస్తూ, తల ప్రక్కకి తిప్పాడు కిల్లర్. అంతే. అతని శరీరంలో కదలిక క్షణం ఆగిపోయింది. అతని తలకు కొంచం ప్రక్కగా, గుండ్రంగా చుట్టచుట్టుకుని, పడగవిప్పి తలను ముందుకు వెనక్కు వూపుతూ కన్పించింది కింగ్ కోబ్రా! దాని రెండునాలికలు బెడ్ కాంతిలో నోటిలోంచి ఆడుతూ కన్పిస్తున్నాయ్.
'బుస్' మంది ఆ కింగ్ కోబ్రా కిల్లర్ తల త్రిప్పగానే. క్షణంలో అర్ధమయింది కిల్లర్‌కి తనను నిద్ర లేపిందేమిటో. అది కింగ్ కోబ్రా బుస. ఆ బుస వింటూనే తనను లేపాయ్ తన జ్ఞానేంద్రియాలు.
కానీ యింత దగ్గరగా... యిటువంటి పరిస్థితుల్లో, తన తల దగ్గర పాము రూపంలో ప్రత్యక్షమయిన మృత్యువుని తప్పించుకోవటం ఎలా? కన్నార్పకుండనే ఆ పామునే చూస్తున్నాడు కిల్లర్.
పాము కూడ నాలుకల్ని వికృతంగా నోటిలోంచి ముందుకు వెనక్కూ ఆడిస్తూ చిన్న-చిన్న కళ్ళతో కిల్లర్‌నే చూస్తూవుంది. కిల్లర్ కుడిచెయ్యి అతి మెల్లగా కదిపాడు. తను దాని కాటుకు గురికావడం ఖాయం అని కిల్లర్‌కి తెలుసు.
